అమ‌రావ‌తిలో ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తిపై ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

29-06-2022 Wed 20:40
  • ఉచిత వ‌స‌తిని ర‌ద్దు చేస్తూ మ‌ధ్యాహ్నం జీఏడీ ఉత్త‌ర్వులు
  • మ‌రో రెండు నెల‌ల పాటు పొడిగించాలంటూ రాత్రి జ‌గ‌న్ ఆదేశాలు
  • షేరింగ్ ప్రాతిప‌దిక‌న ఉచిత వ‌స‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌
ap cm ys jagan orders 2 months free accomodation to employees in amaravati
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తిని ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క ఆదేశాలు జారీ చేశారు. మ‌రో రెండు నెలల పాటు ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి క‌ల్పించాల‌ని ఆయ‌న అధికారుల‌ను అదేశించారు. ఈ మేర‌కు బుధవారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి.

అమ‌రావ‌తిలో ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తిని ర‌ద్దు చేస్తూ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారంలోగా ఫ్లాట్ల‌ను ఖాళీ చేయాల‌ని కూడా ఆ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ వ్య‌వ‌హారంపై ఉద్యోగుల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీనిపై స‌మాచారం అందుకున్న జ‌గ‌న్ ఉద్యోగుల ఉచిత వ‌స‌తిని మ‌రో రెండు నెల‌ల పాటు పొడిగించాల‌ని ఆయ‌న అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

జ‌గ‌న్ ఆదేశాల‌తో ఏపీ ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేసుకోనున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా జ‌గ‌న్ అనుమ‌తించిన ఉచిత వ‌స‌తిని ఉద్యోగులు షేరింగ్ ప్రాతిప‌దిక‌న వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ వెసులుబాటు స‌చివాల‌యం, రాజ్ భ‌వ‌న్‌, హైకోర్టు, అసెంబ్లీ, శాఖాధిప‌తుల కార్యాల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ల‌భించ‌నుంది.