చంపుతామంటూ బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపులు

29-06-2022 Wed 20:21
  • వీర సావ‌ర్క‌ర్‌పై గతంలో స్వ‌ర భాస్క‌ర్ కామెంట్లు
  • సావ‌ర్క‌ర్‌ను అవ‌మానిస్తే స‌హించ‌బోమంటూ దుండ‌గుల లేఖ‌
  • వెర్సోవా పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాలీవుడ్ న‌టి
ctor Swara Bhaskar Receives Death Threat In Letter
స‌మ‌కాలీన సామాజిక అంశాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్న బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు తాజాగా బెదిరింపులు ఎదుర‌య్యాయి. చంపుతామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఆమెకు ఓ లేఖ అందింది. ఈ లేఖ‌ను చూసిన వెంట‌నే న‌టి ముంబైలోని వెర్సోవా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. స్వ‌ర భాస్క‌ర్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. 

వీర సావ‌ర్క‌ర్‌ను అవ‌మానిస్తే దేశ యువ‌త స‌హించ‌బోద‌ని స‌ద‌రు లేఖలో దుండ‌గులు స్వ‌ర భాస్క‌ర్‌ను హెచ్చ‌రించారు. బ్రిటిష్ ప్ర‌భుత్వానికి సావ‌ర్క‌ర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని, జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని బ్రిటిష్ పాల‌కుల‌ను ఆయ‌న వేడుకున్నార‌ని, ఇది ముమ్మాటికీ వీర‌త్వం కాద‌ని గ‌తంలో స్వర భాస్క‌ర్ ట్వీట్ చేశారు. ఆ త‌ర్వాత కూడా మ‌రోమారు కూడా సావ‌ర్క‌ర్‌పై ఆమె సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేశారు. తాజాగా ఉద‌య‌పూర్‌లో జ‌రిగిన హ‌త్య‌నూ ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆమెను చంపుతామంటూ బెదిరింపులు రావ‌డం గ‌మ‌నార్హం.