నా వ‌ల్ల త‌ప్పేమైనా జ‌రిగి ఉంటే క్ష‌మించండి!.. కేబినెట్ భేటీలో ఉద్ధ‌వ్ థాకరే ఉద్వేగం!

29-06-2022 Wed 19:16
  • ఉద్ధ‌వ్ నేతృత్వంలో భేటీ అయిన మ‌హారాష్ట్ర కేబినెట్‌
  • రెండున్న‌రేళ్లుగా స‌హ‌క‌రించార‌ని మంత్రుల‌కు ఉద్ధ‌వ్ ధ‌న్య‌వాదాలు
  • త‌న వాళ్లే త‌న‌ను మోస‌గించారంటూ కీల‌క వ్యాఖ్య‌లు
maharashtra cm uddhav Rhackeray emotional comments in cabinet meeting
మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఉద్ధ‌వ్ థాక‌రే బుధ‌వారం ఉద్వేగానికి గుర‌య్యారు. ముంబైలోని సెక్ర‌టేరియ‌ట్‌లో జ‌రిగిన కేబినెట్ భేటీ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న వ‌ల్ల త‌ప్పేమైనా జ‌రిగి ఉంటే క్ష‌మించాల‌ని ఆయ‌న త‌న కేబినెట్ మంత్రుల‌తో అన్నారు. అంతేకాకుండా త‌న‌కు ఇన్ని రోజులుగా మ‌ద్ద‌తుగా నిల‌బ‌డినందుకు ఆయ‌న మంత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

రెండున్న‌రేళ్లుగా అంద‌రూ త‌న‌కు స‌హ‌కరించార‌ని కూడా ఉద్ధ‌వ్ థాక‌రే వ్యాఖ్యానించారు. త‌న వాళ్లే త‌న‌ను మోసం చేశార‌ని కూడా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత కేబినెట్ భేటీని ముగించుకుని స‌చివాల‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉద్ధ‌వ్ థాక‌రే మీడియా ప్ర‌తినిధుల‌కు న‌మ‌స్కారం చేసి వెళ్లిపోయారు. కేబినెట్ భేటీలో ఉద్ధ‌వ్ థాక‌రే కీల‌క వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సీఎం ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేస్తార‌న్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.