cooking oils: ఈ వంట నూనెలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

  • కనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్ మంచివి
  • ఆవనూనె, నువ్వుల నూనెతోనూ ప్రయోజనాలు
  • వీటితో గుండెకు ఆరోగ్యం, అదుపులో రక్తపోటు
  • వేరు శనగ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ కూ మద్దతు
Must Have Cooking Oils to Keep in Your Kitchen For Healthy

వంట నూనెలు అన్నీ మంచివి కావు. కొన్ని మాత్రం ఆరోగ్యానికి మంచి చేస్తాయి. మరి ఏ వంట నూనెతో హాని కలుగుతుంది? దీనికి స్పష్టమైన సమాధానం వెతకడం కష్టమే. ఎందుకంటే ఇంటర్నెట్ లో ఉండే బోలెడు సమాచారంతో ఎక్కువ మందికి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. 


మన దేశంలో వంట కోసం ఎన్నో నూనెలను ఉపయోగిస్తుంటారు. సంప్రదాయ నెయ్యి కాకుండా, వేరుశనగ, పొద్దుతిరుగుడు, రైస్ బ్రాన్, కోకోనట్.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. మరి ఆరోగ్యానికి సాయపడే వంట నూనె ఏదన్న సందేహం రావచ్చు. దీనికి న్యూట్రిషనిస్ట్, డాక్టర్ అన్షు చతుర్వేది వివరించారు. 

కనోలా ఆయిల్
కనోలా సీడ్స్ నుంచి తీసే నూనె ఇది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువ. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేందుకు సాయపడుతుంది. గుండెకు మేలు చేసే ఒమెగా ఫ్యాటీ 3 ఫ్యాటీ యాసిడ్ అయిన ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించడానికి సాయపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

మస్టర్డ్ ఆయిల్ (ఆవనూనె)
ఆవ నూనెను మన పూర్వీకులు సైతం ఉపయోగించారు. దీని వాసన కొంత భిన్నంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని ఉపయోగించరు. కానీ, ఈ నూనె ఆరోగ్యదాయని. ఇందులో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

ఆలివ్ ఆయిల్ 
బహుళ ప్రయోజనాలున్న వంట నూనె ఇది. దీనితోపాటు ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇంకా మంచిది. గుండె ఆరోగ్యానికి ఈ నూనెతో మంచి జరుగుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. వేపుళ్లకు ఇది అనుకూలం. విటమిన్ ఈ, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కేన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణనిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

పొద్దుతిరుగుడు నూనె
సన్ ఫ్లవర్ ఆయిల్ వేపుళ్లకు అనుకూలం. నూనెలో చేసే పూరి, గారె తదితర వంటలకు మంచిది. అధిక స్మోక్ పాయింట్ దీని సొంతం. ఒక నూనెను మళ్లీ మళ్లీ కాచి వాడకూడదు. దీనివల్ల నాణ్యత కోల్పోయి, ట్రాన్స్ ఫ్యాట్స్ విడుదల అవుతాయి. 

సిసేమ్ ఆయిల్ (నువ్వుల నూనె)
ముందు నుంచీ వాడుకలో ఉన్న నూనె ఇది. ఆవ నూనె మాదిరే, దీన్ని కూడా వెనకటి ప్రజలు ఉపయోగించారు. ముఖ్యంగా నువ్వుల నూనెకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మోనో, పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాట్స్ కు ఇది నిలయం. గుండె జబ్బుల రిస్క్ ను, రక్తపోటును తగ్గిస్తాయి. 

ఫ్లాక్స్ సీడ్
ఇందులో పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఒమెగా 3 ఆరోగ్యానికి మంచిది. జీర్ణాశయం ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.  

వేరుశనగ నూనె
మన సమాజంలో ఎక్కువ మంది ఉపయోగించే వంట నూనెల్లో ఇది కూడా ఒకటి. ఇందులో మోనో అన్ శాచురేటెడ్, విటమిన్ ఈ, పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కనుక దీనివల్ల గుండెకు మేలు అని చెబుతుంటారు. 

వీటిల్లో వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల మంచి, చెడుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ గుండెకు మంచి చేస్తాయి. అదే ఒమెగా ఫ్యాటీ 6 యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు, రక్తంలో క్లాట్స్ ఏర్పడి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందని కొందరు వాదిస్తుంటారు. మరి కొందరు అయితే ఒమెగా 6 ప్రభావాన్ని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ న్యూట్రలైజ్ చేస్తాయని చెబుతారు. ఇక్కడి మిగిలిన నూనెల ప్రయోజనాల విషయంలో భిన్నాభిప్రాయాల్లేవు.

More Telugu News