Shiv Sena: గవర్నర్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన శివసేన

Shiv Sena moves SC against Maharashtra governor call for floor test tomorrow
  • గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో శివసేన వాదన 
  • 16 మంది ఎమ్మెల్యేల అనర్హతను ముందు తేల్చాలని వినతి
  • అప్పటి వరకు సభలో మెజారిటీ నిరూపణ వద్దంటూ పిటిషన్
  • నేటి సాయంత్రం 5 గంటలకు విచారణ
సభలో బలనిరూపణకు మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను శివసేన సుప్రీం కోర్టులో సవాలు చేసింది. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రభు తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ఉద్ధవ్ థాకరే సర్కారును గవర్నర్ కోష్యారీ ఆదేశించడం తెలిసిందే. 

తమ పిటిషన్ పై అత్యవసరంగా వాదనలు వినాలని శివసేన తరఫున సింఘ్వి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. గవర్నర్ ఆదేశాలు చట్ట విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. ‘‘సభలో విశ్వాస నిరూపణకు ఆదేశించినప్పుడు అందులో పేర్లను పేర్కొనకూడదు’’ అని సింఘ్వి తెలిపారు. ఏక్ నాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేల అనర్హత చర్యలు సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అనర్హత పిటిషన్ తేల్చే వరకు సభలో విశ్వాస పరీక్ష నిర్వహణకు అవకాశం లేదన్నారు. ఈ పిటిషన్ లో అత్యవసర వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. నేటి సాయంత్రం 5 గంటలకు పిటిషన్ ను విచారించనుంది.
Shiv Sena
Supreme Court
challenge
governar orders
floor test

More Telugu News