ప్రధాని అలా వెళ్లగానే.. నన్ను ఇలా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు: రఘురామకృష్ణరాజు

29-06-2022 Wed 08:42
  • వచ్చే నెలలో భీమవరంలో పర్యటించనున్న మోదీ
  • రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ప్రణాళిక రెడీ చేశారన్న రఘురామరాజు
  • దానికి తానే కారణమని అరెస్ట్ చేసే కుట్ర చేస్తున్నారన్న ఎంపీ
  • తన దారిన తాను వచ్చి వెళ్లిపోతానని వ్యాఖ్య
Narasapuram MP Raghurama Raju serious allegations against ap govt
భీమవరంలో తనను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. జులై నాలుగో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరానికి రానున్నారు. పట్టణంలో మోదీ ప్రసంగించి వెళ్లిపోయిన వెంటనే రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని కొందరు పథకం పన్నారని, ఆ తర్వాత ఆ ఘర్షణలకు తానే కారణమని కేసులు పెట్టించేందుకు పెద్దలు కుట్ర చేస్తున్నారని రఘురామ రాజు పేర్కొన్నారు. 

ఇలాంటి వాటికి తాను భయపడే రకం కాదని, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. అంతేకాదు, పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన దారిలో తాను వచ్చి వెళ్లిపోతానని, ప్రభుత్వ పెద్దలు ఎక్కువ చేస్తే ప్రధాని సమక్షంలోనే తన రక్షణ గురించి అభ్యర్థించాల్సి వస్తుందన్నారు. 

ప్రధాని సభ జరిగే ప్రాంతంలో తన ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని, కడితే తొలగించాలని అధికారులను జగన్ ఆదేశించినట్టు తనకు తెలిసిందన్నారు. అభిమానులు తన ఫ్లెక్సీలు కట్టి తీరుతారని, ఎవరేం చేస్తారో చూస్తానని రఘురామ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.