తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు భారీ వర్షాలు

29-06-2022 Wed 07:24
  • మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి
  • మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు
  • అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • నేరెడ్‌మెట్‌లో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
Heavy Rains Expected in Telangana Today
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాటి ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉన్నట్టు పేర్కొంది. 

ఇక రాష్ట్రంలో మొన్న ఉదయం నుంచి నిన్న ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో అత్యల్పంగా 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

అలాగే, నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.