ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్

28-06-2022 Tue 18:02
  • 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో గోపీచంద్
  • తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రస్తావన
  • 'వర్షం'  సినిమాకి ముందే తాము స్నేహితులమంటూ వ్యాఖ్య 
  • మరోసారి కలిసి నటిస్తామన్న గోపీచంద్  
Gopichand Interview
గోపీచంద్ హీరోగా రూపొందిన 'పక్కా కమర్షియల్' వచ్చేనెల 1వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన  గోపీచంద్, ప్రభాస్ ను గురించి ప్రస్తావించాడు. "ప్రభాస్ తో 'వర్షం' సినిమా చేయడానికి ముందు నుంచే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

అప్పట్లో నేను గోపీకృష్ణ మూవీస్ ఆఫీస్ దగ్గరికి వెళుతూ ఉండేవాడిని. అక్కడికి ప్రభాస్ బైక్ పై వచ్చేవాడు. ఫస్టు టైమ్ తనని చూసినప్పుడే 'చాలా బావున్నాడు ..  హీరో అవుతాడు' అనుకున్నాను. ఆ తరువాత మా మధ్య స్నేహం ఏర్పడింది. ఎక్కువగా అక్కడే కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. 'వర్షం' సినిమాను మేమిద్దరం ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాము. 

ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయినా మా స్నేహం అలాగే ఉంది. ఇద్దరం కలిసి మరో సినిమా చేద్దాం అని ప్రభాస్ అంటూ ఉంటాడు. మంచి కథ దొరికితే తప్పకుండా చేయాలనుంది. త్వరలో తప్పకుండా చేస్తామనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. మరి అలాంటి ఒక రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.