ప్రభాస్​, నానితో అమితాబ్​ బచ్చన్​.. రాఘవేంద్రరావు, ప్రశాంత్​ నీల్​, నాగ్​ అశ్విన్​ కూడా..

28-06-2022 Tue 15:21
  • బ్లాక్ బస్టర్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన అమితాబ్ బచ్చన్
  • సినిమా దిగ్గజాలతో ఓ సాయంత్రం అంటూ క్యాప్షన్
  • తర్వాత అమీర్ ఖాన్ వచ్చి పలకరించిన చిత్రం కూడా..
amitabh bachchan met prabhas dulquer salmaan nani aamir
ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ హీరో.. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న మరో హీరో.. తమదైన శైలిలో ఆకట్టుకునే మరో ఇద్దరు హీరోలు.. సినిమాలకు కొత్త దారిచూపిన ఓ దర్శకుడు.. కొత్త దారిలో నడుస్తూ చరిత్ర సృష్టిస్తున్న మరో ఇద్దరు దర్శకులు.. ఇలా అంతా ఒక్క చోట చేరితే.. అదో చిత్రం. అలాంటి బ్లాక్ బస్టర్ ఫొటోను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సినిమాలపై మాట్లాడుకున్నాం..
అంతా కలిసిన చిత్రాన్ని పోస్టు చేస్తూ అమితాబ్ వరుసగా ఎవరెవరు ఏమిటో క్యాప్షన్ లో పేర్కొనడం ఆకట్టుకుంటోంది. ‘‘సినిమా దిగ్గజాలతో ఓ సాయంత్రం.. ప్రభాస్– బాహుబలి; ప్రశాంత్– కేజీఎఫ్ డైరెక్టర్; ఓ సాధారణ ఏబీ (అమితాబ్ బచ్చన్); రాఘవేంద్రరావు– లెజెండరీ సినీ నిర్మాత; నాని–ఫిల్మ్, టీవీ స్టార్; దుల్కర్–మలయాళం, తమిళ్, హిందీ స్టార్; నాగ్ అశ్విన్–ప్రాజెక్ట్ కె దర్శకుడు.. ఫిల్మ్, సినిమా పనులపై చర్చిస్తూ సరదాగా గడిపాం..” అని పేర్కొన్నారు.

మరో స్టార్ కారు విండో తట్టారు 
అమితాబ్ బచ్చన్ బయలుదేరుతుండగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అక్కడికి వచ్చారు. అప్పటికే అమితాబ్ కారులో ఎక్కడంతో కారు అద్దంపై తట్టి పిలిచారు. ఈ ఫొటోను కూడా అమితాబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “నేను వెళ్లిపోతుండగా ఎవరో నా కారు విండో తట్టారు. తీసి చూస్తే అమీర్ ఖాన్ ఉన్నారు. ఈ సాయంత్రం చాలా మంది లెజెండరీ ఫ్రెండ్స్ ను కలిశాను” అని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.