KCR: తెలంగాణ నాయకత్వం దేశానికే మార్గాన్ని చూపుతుందని పీవీ నిరూపించారు : కేసీఆర్

  • ఈ రోజు దివంగత పీవీ నరసింహారావు జయంతి
  • ఒక ప్రకటన ద్వారా నివాళి అర్పించిన కేసీఆర్
  • తమ ప్రభుత్వానికి పీవీనే స్ఫూర్తి అని వ్యాఖ్య
PV Narasimha Rao is inspiration to us says KCR

దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రోజుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి... దేశాన్ని కాపాడిన ఆధునిక భారత నిర్మాత దివంగత ప్రధాని పీవీ నరసింహారావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఈరోజు పీవీ జయంతి. ఈ సందర్భంగా ఒక ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఆయనకు ఘన నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి బాట పట్టించిన మహోన్నతుడని కొనియాడారు. తన వినూత్నమైనటువంటి సంస్కరణలతో దేశ సంపద ఎన్నో రెట్లు పెరిగేలా చేశారని అన్నారు. పీవీ నాయకత్వంలో దేశం ఆర్థికంగానే కాకుండా విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, అణుశక్తి వంటి రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధిని సాధించిందని చెప్పారు.  

పీవీ నరహింహారావు నుంచి తమ ప్రభుత్వం ఎంతో స్ఫూర్తిని పొందిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ నాయకత్వం దేశానికే మార్గాన్ని చూపుతుందనే విషయాన్ని పీవీ నిరూపించారని అన్నారు. పీవీ స్పూర్థితో తాము ముందుకు సాగుతామని చెప్పారు. పీవీ నరసింహారావు 1921 జూన్ 28న కరీంనగర్ జిల్లాలో జన్మించారు.

More Telugu News