రెండు సార్లు రాజీనామా చేయాలనుకున్న ఉద్ధవ్ థాకరే.. ఎవరి వల్ల ఆగిపోయారో తెలుసా!

28-06-2022 Tue 12:03
  • జూన్ 21న, 22న సీఎం పదవికి రాజీనామా చేయాలనుకున్న థాకరే
  • రెండు సార్లు ఆ ప్రయత్నాన్ని నిలువరించిన శరద్ పవార్
  • చాకచక్యంతో పోరాటం చేయాలని థాకరేకు పవార్ హితవు
Uddhav Thackeray tried to resign to CM post for two times
మహారాష్ట్రలో చెలరేగిన రాజకీయ సంక్షోభం రకరకాల మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. శివసేనలో జరిగిన తిరుగుబాటు రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏ క్షణంలోనైనా కూల్చేసే పరిస్థతి నెలకొంది. మరోవైపు ఈ సంక్షోభం తలెత్తిన తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి రెండు సార్లు రాజీనామా చేయాలనుకున్నారట. అయితే ఈ రెండు సార్లూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయనకు నచ్చచెప్పి రాజీనామా చేయకుండా ఆపారట. 

తొలుత జూన్ 21న సీఎం పదవికి థాకరే రాజీనామా చేయాలనుకున్నారు. ఆరోజు సాయంత్రం ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రకటించాలని భావించారు. శివసేన నుంచి మరింత మంది రెబెల్స్ బయటకు వెళ్తారనే ఆందోళనతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రయత్నాన్ని శరద్ పవార్ అపేశారట. 

ఆ తర్వాత ఆ మరుసటి రోజు మళ్లీ రాజీనామా చేయాలని థాకరే భావించారు. ఉన్నతాధికారులను పిలిపించుకుని ఫేర్ వెల్ కు సంబంధించి చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అయితే మళ్లీ శరద్ పవార్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. దాదాపు గంట సేపు మాట్లాడి ఉద్ధవ్ తో రాజీనామా ప్రయత్నాన్ని విరమింపజేశారు. చాకచక్యంగా పోరాటం చేయాలని... వెన్ను చూపి పారిపోవద్దని హితవు పలికినట్టు సమాచారం. శరద్ పవార్ ఇచ్చిన ధైర్యంతోనే రెబెల్స్ ను ఎదుర్కొంటానని థాకరే ప్రకటించారని అంటున్నారు.