ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌పై సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

27-06-2022 Mon 17:37
  • గొర్రెల మంద‌లో ఈడీ ఓ తోడేలు లాంటిద‌న్న నారాయ‌ణ‌
  • రౌత్‌కు ఈడీ స‌మ‌న్లు స‌రి కాద‌ని ఖండ‌న‌
  • శివ‌సేన‌లో సంక్షోభాన్ని వాళ్లే చూసుకుంటార‌న్న సీపీఐ నేత‌
  • ఆ సంక్షోభంతో బీజేపీకి ఏం ప‌ని అని నిల‌దీత‌
  • న‌చ్చ‌ని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కుట్ర‌ల‌ని ఆరోప‌ణ‌
cpi narayana harsh comments on enforcement directorate
ఆర్థిక నేరాల ద‌ర్యాప్తు బాధ్య‌త‌లను నిర్వ‌ర్తిస్తున్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గొర్రెల మంద‌లో తోడేలు లాంటిదే ఈడీ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎవ‌రు అవున‌న్నా, కాద‌న్నా కూడా ఈడీ ఓ బ్లాక్ షీప్ అని ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేయ‌డం స‌బ‌బు కాద‌ని కూడా నారాయ‌ణ అన్నారు.

మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం, సంజ‌య్ రౌత్‌కు ఈడీ స‌మ‌న్ల‌పై సోమ‌వారం నారాయ‌ణ స్పందించారు. శివ‌సేన రెబెల్ శిబిరం ఎక్క‌డో అసోంలో కూర్చుని త‌మ‌కు బ‌లం ఉందంటే ఎలా అని ప్ర‌శ్నించిన నారాయ‌ణ‌... మ‌హారాష్ట్రకే వ‌చ్చి త‌మ బ‌లాన్ని నిరూపించుకోవాల‌ని సూచించారు. 

అయినా శివ‌సేన రెబెల్ శిబిరాన్ని బీజేపీ ఎలా ప్రోత్స‌హిస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. శివ‌సేన‌లో సంక్షోభం ఉంటే ఆ పార్టీ వాళ్లు ప‌రిష్క‌రించుకుంటార‌న్న నారాయ‌ణ‌... దానితో బీజేపీకి ఏం ప‌ని అని ఆయ‌న నిల‌దీశారు. బీజేపీకి న‌చ్చ‌ని పార్టీలు అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఆయా పార్టీల్లో చీల‌క‌లు తెచ్చి, త‌ద్వారా అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని నారాయ‌ణ ఆరోపించారు.