ఖైర‌తాబాద్‌లో ఈ సారి 50 అడుగుల మ‌ట్టి వినాయ‌కుడు... న‌మూనా విడుద‌ల‌

27-06-2022 Mon 17:22
  • ఖై‌రతాబాద్ గ‌ణేశ్ ప్ర‌తిమ న‌మూనా విడుద‌ల‌
  • తొలిసారి పూర్తిగా మ‌ట్టితోనే రూపొంద‌నున్న వినాయ‌కుడు
  • ఎడ‌మ వైపు త్రిశ‌క్తి మ‌హా గాయ‌త్రి, కుడి వైపు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి రూపంతో నిమ‌జ్జ‌నానికి త‌ర‌ల‌నున్న వైనం
this time khairatabad vinayaka will made up of pure mud
వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ ఏడాది ఖైర‌తాబాద్‌లో ఆవిష్కరించ‌నున్న గ‌ణేశుడి ప్ర‌తిమ‌కు సంబంధించిన న‌మూనాను ఖైత‌రాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ సోమ‌వారం విడుద‌ల చేసింది. ఈ ద‌ఫా 50 అడుగుల ఎత్తుతో రూపొందించ‌నున్న ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పూర్తిగా మ‌ట్టితోనే నిర్మితం కానున్నాడు. ఇప్ప‌టిదాకా ఏర్పాటైన వినాయ‌క ప్ర‌తిమ‌ల‌న్నీ ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో రూపొందిన‌వే. అయితే తొలిసారి ఖైర‌తాబాద్ గ‌ణేశుడు పూర్తిగా మ‌ట్టితోనే రూపొంద‌నున్నాడు. 

మ‌ట్టి గ‌ణప‌తుల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌భుత్వ పిలుపుతోనే ఈ ద‌ఫా మ‌ట్టి వినాయ‌కుడి ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఉత్స‌వ కమిటీ తెలిపింది. పంచ‌ముఖ లక్ష్మీ గ‌ణ‌ప‌తి రూపంలో ఖైర‌తాబాద్ వినాయ‌కుడు ఈ సారి ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఎడ‌మ వైపు త్రిశ‌క్తి మ‌హా గాయ‌త్రి, కుడి వైపు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి రూపంతో వినాయ‌కుడు నిమ‌జ్జ‌నానికి త‌ర‌ల‌నున్నాడు.