ఆత్మకూరు ఉప ఎన్నిక విజేత విక్రమ్ రెడ్డికి సీఎం జగన్ అభినందనలు

28-06-2022 Tue 15:03
  • భారీ మెజారిటీతో నెగ్గిన మేకపాటి విక్రమ్ రెడ్డి
  • తాడేపల్లిలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వైనం
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సీఎం జగన్
CM Jagan appreciates Mekapati Vikram Reddy
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగడం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు 82,888 వేల ఓట్ల మెజారిటీతో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు విజయం కట్టబెట్టారు. 

ఈ నేపథ్యంలో, విక్రమ్ రెడ్డి నేడు తాడేపల్లిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ మెజారిటీతో గెలిచిన విక్రమ్ రెడ్డిని ఈ సందర్భంగా సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. 

ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి కుటుంబానికి చెందిన విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు పడ్డాయి. మొత్తం 20 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించగా, ప్రతి రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డిదే పైచేయి అయింది. అటు 205 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 167 ఓట్లు విక్రమ్ రెడ్డికే లభించాయి.