రోదసిలో మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న చైనా

27-06-2022 Mon 16:01
  • ఖగోళ పరిశోధనల్లో మేటిగా ఎదుగుతున్న చైనా
  • అమెరికా, రష్యాలకు దీటుగా పరిశోధనలు
  • తాజాగా 10 కిలోవాట్ల శక్తితో సోలార్ ప్లాంట్
  • ప్రాథమిక దశల పూర్తి
  • 2028 నాటికి అందుబాటులోకి ప్లాంట్
China to establish first ever solar power plant in space
అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా వంటి మేటి దేశాలకు దీటుగా చైనా కూడా అనేక ఘనవిజయాలు సాధించింది. చంద్రుడి నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకురావడంలో చైనా సఫలమైంది. అత్యంత కఠినమైన అంగారక గ్రహంపై మొదటి ప్రయత్నంలోనే ల్యాండ్ అవడమే కాదు, రోవర్ ను నడిపించి పరిశోధనలు చేపట్టడం రోదసి పరిశోధన రంగంలో చైనా అభివృద్ధికి నిదర్శనం. 

ఈ క్రమంలో మరో ఘనతకు చైనా శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. రోదసిలో మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రాథమిక దశలు పూర్తి చేసుకుంది. 2028 నాటికి ఈ సౌరశక్తి కేంద్రం అందుబాటులోకి రానుంది. సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగానూ, సూక్ష్మ తరంగాలు గానూ మార్చడం ఈ ప్లాంట్ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉత్పన్నమయ్యే శక్తిని కక్ష్యల్లో పరిభ్రమించే శాటిలైట్లకు అందించడంతో పాటు, ఈ శక్తిని కిరణాల రూపంలో భూమిపై నిర్దేశిత ప్రాంతాలకు వైర్ లెస్ పద్ధతిలో ప్రసారం చేస్తారు. 

దీనికి సంబంధించిన చైనాలోని గ్జిడియన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. సౌరశక్తిని భూమికి తరలించేందుకు ఈ సోలార్ పవర్ ప్లాంట్ ను వాహకంగా ఉపయోగించనున్నారు. ప్రాథమిక దశలో చేపట్టిన ప్రయోగాలు ఈ మేరకు సత్ఫలితాలను ఇవ్వడంతో చైనా శాస్త్రవేత్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ పవర్ ప్లాంట్ శక్తి 10 కిలోవాట్లు అని తెలుస్తోంది.