YSRCP: అలిగిన కిల్లి కృపారాణి... జ‌గ‌న్ రాక‌ముందే ఇంటికెళ్లిపోయిన వైనం

  • శ్రీకాకుళంలో జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన కృపారాణి
  • ప్రొటోకాల్ జాబితాలో క‌నిపించ‌ని కృపారాణి పేరు
  • ఫ‌లితంగా జ‌గ‌న్ రాక‌కు ముందే బ‌య‌లుదేరిన కేంద్ర మాజీ మంత్రి
  • కృష్ణ‌దాస్‌, బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌లు స‌ర్దిచెప్పినా వినని వైనం
ysrcp leader anger on protocal officers over her name not in the list

జ‌గ‌న‌న్న అమ్మ ఒడి ప‌థ‌కం నిధుల విడుద‌ల కోసం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న శ్రీకాకుళం చేర‌క‌ముందే ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు శ్రీకాకుళం ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్దకు చేరుకున్న వైసీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలిగారు. ఆపై జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌కుండానే ఆమె ఇంటికెళ్లిపోయారు. 

శ్రీకాకుళం ఆర్అండ్‌బీ అతిథి గృహం వ‌ద్ద జ‌గ‌న్‌కు స్వాగతం ప‌లికే వారికి సంబంధించిన పేర్లను అధికారులు ఖ‌రారు చేశారు. అయితే అందులో కృపారాణి పేరు లేదు. ఈ విష‌యం తెలుసుకున్నంత‌నే ఆగ్ర‌హానికి గురైన కృపారాణి... ప్రొటోకాల్ జాబితాలో త‌న పేరు లేన‌ప్పుడు తాను ఇక్క‌డ ఎందుకు ఉండాలంటూ విస‌విసా త‌న కారు వ‌ద్ద‌కు వెళ్లిపోయారు. 

విష‌యం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ధ‌ర్మ‌నా కృష్ణ‌దాస్‌, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌లు ఆమెను నిలువ‌రించే య‌త్నం చేశారు. అయినా కూడా కృపారాణి శాంతించలేదు. ఓ వైపు త‌న కారు వ‌ద్ద నిలబ‌డి మ‌రీ కృష్ణ‌దాస్ ఆమెకు స‌ర్దిచెప్పే య‌త్నం చేస్తున్నా విండో గ్లాస్ ఎత్తేసిన కృపారాణి కారును క‌దిలించ‌మంటూ డ్రైవ‌ర్‌కు సైగ చేశారు. 

More Telugu News