రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు టైటిల్​ ఇదేనా!

27-06-2022 Mon 14:01
  • ప్రచారంలో ‘సిటిజన్’ పేరు 
  • చరణ్ సరసన హీరోయిన్ గా కియారా
  • శరవేగంగా జరుగుతున్న షూటింగ్
Interesting title for charan shankar new movie
దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’తో కెరీర్లోనే అత్యుత్తమ విజయం అందుకున్న తర్వాత ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. తండ్రి చిరంజీవితో చేసిన పూర్తి స్థాయి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న తన తదుపరి సినిమాపై చరణ్ అంచనాలు పెట్టుకున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

     శంకర్ మార్కు సందేశంతో పాటు భారీ యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం శర వేగంతో చిత్రీకరణ జరుగుతోంది. కొన్ని రోజుల కిందట లొకేషన్లోని కొన్ని ఫొటోలు కూడా నెట్లో ప్రత్యక్షం అయ్యాయి. ఇక, ఈ సినిమా టైటిల్‌ ను చిత్ర బృందం ఇప్పటిదాకా ప్రకటించలేదు. కానీ, సినిమా పేరుపై రోజుకో వార్త వినిపిస్తోంది. ‘విశ్వంభర’, ‘సర్కారోడు’తో పాటు ‘అధికారి’ అనే టైటిల్‌ కూడా తెరపైకొచ్చింది. ఈ చిత్రంలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తాడు. దాంతో, ‘అధికారి’ అయితే సరిపోతుందని చిత్రం బృందం భావిస్తోందని అనుకున్నారు.

     కానీ ఇప్పుడు మరో టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. చరణ్-శంకర్ చిత్రానికి ‘సిటిజన్‌’ అనే టైటిల్ దాదాపు ఖరారు చేశారని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఇది ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో అన్ని భాషలకు సరిపోయే టైటిల్ ఉండాలని, ‘సిటిజన్’ అయితేనే అందరికీ ఇట్టే చేరువవుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. అవసరం అయితే ‘సిటిజన్ ఆఫ్ ఇండియా’ అని పెట్టాలని కూడా అనుకుంటున్నారని తెలుస్తోంది. ఏ రకంగా చూసుకున్నా ఈ టైటిల్ ఆసక్తికరంగా ఉంది. మరి, చిత్ర బృందం దీన్నే ఖరారు చేస్తుందో లేక ఇంకో టైటిల్ను వెతుకుతుందో చూడాలి.