Telangana: తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్​ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్​ నేరగాళ్లు!

  • పలువురు ప్రముఖులు, సామాన్యులకు కూడా  సందేశాలు
  • ఫిర్యాదు రావడంతో అప్రమత్తమైన సైబర్ క్రైం విభాగం
  • ఇలాంటి ఫేక్ రిక్వెస్టులకు స్పందించవద్దని సూచన
  • వ్యవహారంపై విచారణకు ఆదేశించిన డీజీపీ మహేందర్ రెడ్డి
Cyber criminals request money from police using DGPs photo as whatsapp DP

ఇంటర్నెట్ విస్తృతి పెరిగి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిన ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. కొత్త కొత్త పంథాలలో సైబర్ నేరగాళ్లు జనాలకు వల విసురుతున్నారు. కేవలం సామాన్యులకే కాకుండా రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులకు సైబర్ నేరగాళ్లతో సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలామందికి వాట్సాప్ లో టోకరా ఇచ్చిన కేటుగాళ్లు.. ఈ సారి ఏకంగా తెలంగాణ డీజీపీ పేరు, ఫొటో కూడా వాడుకున్నారు.

 97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టిన కేటుగాళ్లు కొందరిని డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఉన్నారట. సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో మెసేజ్లు వెళ్లినట్లు తెలుస్తోంది. 

డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైం విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. కాగా, ఈ మెసేజ్ ల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

More Telugu News