చిరంజీవితో తలపడే పవర్ఫుల్ విలన్ గా బిజు మీనన్!

27-06-2022 Mon 10:57
  • 'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి 
  • షూటింగు దశలో ఉన్న ప్రాజెక్టు 
  • కథానాయికగా శ్రుతి హాసన్ 
  • సంక్రాంతికి భారీ రిలీజ్    
Valther Veerrayya movie update
చిరంజీవి ఫలానా సినిమా చేస్తున్నారనగానే, అందులో విలన్ ఎవరై ఉంటారనే ఆసక్తి తలెత్తుతుంది. ఎందుకంటే చిరంజీవి స్థాయికి తగినట్టుగా విలన్ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. హీరోగా చిరంజీవికి గల క్రేజ్ ను .. ఆయన అనుభవాన్ని తట్టుకుని నిలబడగలిగే ప్రతినాయకుడిని పెట్టడానికే మేకర్స్ ప్రయత్నిస్తుంటారు.  

అలాంటి చిరంజీవి సెట్స్ పై మూడు ప్రాజెక్టులు ఉంచారు .. వాటిలో 'వాల్తేర్ వీరయ్య' ఒకటి. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మలయాళ నటుడు బిజు మీనన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. బిజు మీనన్ కి తెలుగు సినిమాలు కొత్త కాదు .. విలనిజం కూడా కొత్తకాదు. 

మలయాళ స్టార్స్ లో ఒకరైన బిజు మీనన్ కి నటనలో 20 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. సహజనటుడుగా మలయాళంలో ఆయనకి మంచి పేరు ఉంది. తెలుగులో రవితేజ 'ఖతర్నాక్' .. గోపీచంద్ 'రణం' సినిమాల్లో ఆయనే విలన్. 'రణం' సినిమాలోని పాత్ర ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆయననే చిరూ సినిమాలో విలన్ గా ఖాయం చేశారని అంటున్నారు. అధికారిక ప్రకటన రావలసి ఉంది.  సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.