బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేదని తేలిపోయింది: అసదుద్దీన్ ఒవైసీ

27-06-2022 Mon 10:37
  • బీజేపీని ఎస్పీ ఓడించలేదనే విషయం తేలిపోయిందన్న అసదుద్దీన్ 
  • సమాజ్ వాది పార్టీలాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీలు ఓటు వేయొద్దని సూచన 
  • అఖిలేశ్ యాదవ్ ఒక అహంభావి అంటూ విమర్శ 
Akhilesh Yadav is arrogant says Owaisi
సమాజ్ వాదీ పార్టీ, ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని ఓడించే సత్తా సమాజ్ వాదీ పార్టీకి లేదనే విషయం ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి మేధోపరమైన నిజాయతీ లేదని విమర్శించారు. ఎస్పీ లాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీలు ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. 

ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఎవరు కారణం? బీజేపీకి బీ టీమ్, సీ టీమ్ అని ఇప్పుడు ఎవరిని పిలవాలి? అని ఒవైసీ ప్రశ్నించారు. రాంపూర్, అజాంఘడ్ ఉపఎన్నికల్లో ఓటమికి బాధ్యుడు అఖిలేశ్ యాదవ్ అని అన్నారు. అఖిలేశ్ ఒక అహంభావి అని... ఆయన కనీసం ప్రజలను కూడా కలవలేదని దుయ్యబట్టారు. ఇలాంటి నేతలను, పార్టీలను నమ్మకుండా... ముస్లింలందరూ తమకంటూ ఒక రాజకీయ గుర్తింపును తెచ్చుకోవాలని కోరుతున్నానని అన్నారు.

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి శివసేన పార్టీ అంతర్గత సమస్య అని ఒవైసీ చెప్పారు. ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని అన్నారు.