Andhra Pradesh: ఏపీలో జులై 5 నుంచి స్కూళ్లు ప్రారంభం.. వారానికి ఒక రోజు 'నో బ్యాగ్ డే'

  • జులై 5 నుంచి వచ్చే ఏడాది 23 వరకు కొత్త విద్యా సంవత్సరం
  • ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు
  • రేపటి నుంచి పాఠశాలలకు హాజరు కానున్న అధ్యాపకులు
Schools in AP to start from July 5

ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై... తదుపరి సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మార్చారు. జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి. ఈ మేరకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి అకాడెమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 

ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. మరోవైపు వారంలో ఒక రోజు 'నో బ్యాగ్ డే' ఉంటుంది. 

జులై 5 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటికీ... ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 28 (రేపు) నుంచే పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలోగా తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలు శుభ్రం చేయించాల్సి ఉంటుంది. 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వా విభాగాలతో సమావేశాలు నిర్వహించాలి. జులై 5న విద్యార్థులకు విద్యా కానుకల కిట్లను పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

More Telugu News