కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ కబ్జాకు గురైంది.. మాకు అధికారమిస్తే పేదలకు ఎకరం భూమి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

27-06-2022 Mon 09:22
  • బహుజన రాజ్యాధికార యాత్రకు వంద రోజులు
  • హనుమకొండలో భారీ బహిరంగ సభ
  • ప్రగతి భవన్‌పై బీఎస్పీ జెండా ఎగరేస్తామన్న ప్రవీణ్ కుమార్
  • 2023లో రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్న రామ్‌జీ గౌతమ్
BSP Telangana Chief RS Praveen Kumar serious Allegations on KCR
బహుజన సమాజ్‌ పార్టీ (BSP) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హనుమకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీకి అధికారం అప్పగిస్తే కులమతాలకు అతీతంగా ప్రతీ పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామన్నారు. అర్హులైన కుటుంబాల నుంచి ఒకరికి విదేశాల్లో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ వంద రోజుల్లో 15 వేల కిలోమీటర్లు పర్యటించి 750 గ్రామాలను సందర్శించామని, గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తమకు కనిపించలేదని అన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేతుల్లో కబ్జాకు గురైందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రగతి భవన్‌పై బీఎస్పీ జెండా ఎగురవేస్తామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా వెంటనే రాజీనామా చేసి బీఎస్పీలో చేరాలని పిలుపునిచ్చారు. 2023లో రాజ్యాధికారం దిశగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, ఏడు రాష్ట్రాల కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ కార్యకర్తలను కోరారు.