రెండేళ్లలో టీడీపీదే అధికారం: దర్శకుడు కె.రాఘవేంద్రరావు

27-06-2022 Mon 08:51
  • బాపట్ల జిల్లా నడిగడ్డపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్నిఆవిష్కరించిన రాఘవేంద్రరావు
  • టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్న దర్శకుడు
  • ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్రరావు ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్న ఆనందబాబు
TDP will come into power in two years says Director Raghavendra Rao
ఏపీలో మరో రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు జోస్యం చెప్పారు. ప్రజల్లో రోజురోజుకు పార్టీపై ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్రరావు నిన్న ఆవిష్కరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దార్శనికుడైన ఎన్టీఆర్ అడుగుజాడల్లో నాయకులు నడవాలన్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెనాలిలో ఏడాదంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.