ప్రయోజనాలు ఆశించి పార్టీపై ఆధారపడి బతకొద్దు!: కార్యకర్తలకు మంత్రి ధర్మాన సూచన

27-06-2022 Mon 06:56
  • కార్యకర్తలు ఏదో ఒక పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని మంత్రి హితవు
  • ధరల పెరుగుదలకు తమ ప్రభుత్వం కారణం కాదన్న ధర్మాన
  • చంద్రబాబు ప్రవేశపెట్టిన మద్యాన్నే తాము అమ్ముతున్నామన్న మంత్రి
Minister Dharmana Prasada Rao advice to party workers
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకర్తలకు కీలక సూచన చేశారు. శ్రీకాకుళంలో నిన్న నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు హితబోధ చేశారు. ప్రయోజనం ఆశించి పార్టీపై ఆధారపడి బతకొద్దని, ఏదో ఒక పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని హితవు పలికారు. 

అలాగే, ప్రతిపక్షాలు, చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారికి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. చంద్రబాబుకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ధరల పెరుగుదలకు వైసీపీ ప్రభుత్వం కారణం కాదని, ఆ ప్రభావం దేశమంతా ఉందని పేర్కొన్నారు. 

ఏపీలో ఇప్పుడు విక్రయిస్తున్న మద్యం నాడు చంద్రబాబు ప్రవేశపెట్టినదేనని అన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి స్థలంతోపాటు రూ.1.80 లక్షలు ఇస్తోందని, దానికి మరికొంత కలుపుకుని ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత వారిదేనని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సభను విజయవంతం చేయాలని, ఆయన పర్యటన విఫలమైతే ఆ బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాన అన్నారు.