Chiranjeevi: గోపీచంద్ తో నాకున్న సంబంధం ఏంటో తెలుసా?: చిరంజీవి

  • గోపీచంద్, రాశీఖన్నా జంటగా పక్కా కమర్షియల్
  • హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • చీఫ్ గెస్టుగా హాజరైన చిరంజీవి
Chiranjeevi speech at Pakka Commercial pre release event

గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తనను అల్లు అరవింద్, గోపీచంద్ తదితరులు కోరారని, వాళ్లందరినీ తన ఇంట్లో చూసేసరికి ఎంతో ఆనందంగా అనిపించిందని వెల్లడించారు. మరేమీ ఆలోచించకుండా, ఈ కార్యక్రమానికి వస్తానని మాటిచ్చానని తెలిపారు. 

ఇక, గోపీచంద్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం మీకేమైనా తెలుసా? అని ఆడియన్స్ ను ప్రశ్నించారు. దానికి సమాధానం కూడా ఆయనే చెప్పారు. 

"నేను ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ లో చేరాను. ఆ సమయంలో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గారు బీకాం ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. కొత్తగా వచ్చిన అబ్బాయెవరో రమ్మనండి అంటూ టి.కృష్ణ గారు నన్ను పిలిపించారు. నేను స్టూడెంట్ లీడర్ గా నిలబడుతున్నాను... నీ మద్దతు కూడా కావాలి... నీకెలాంటి సహకారం కావాలన్నా నన్నడుగు అంటూ, కృష్ణ గారు ఓ పెద్దన్నలాగా భరోసా ఇచ్చారు. ఆయనెప్పుడూ నాకు హీరోలా అనిపిస్తారు. 

ఆ తర్వాత కాలంలో ఆయన, నేను సినిమా రంగంలోకి వచ్చాం. ఆయన ఎన్నో సందేశాత్మక హిట్ చిత్రాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడాయన కుమారుడు గోపీచంద్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కమర్షియల్ హీరోగా పైకి రావడానికి అన్ని హంగులు ఉన్న వ్యక్తి గోపీచంద్. ఈ పక్కా కమర్షియల్ చిత్రం ద్వారా తను మరింత ఉన్నతస్థాయికి చేరతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక దర్శకుడు మారుతి గురించి చెప్పాలంటే... ప్రజారాజ్యం పార్టీ పెట్టాలనుకున్నప్పుడు జెండా రూపకల్పనలో ఎంతో సహకరించాడు. జెండా డిజైనింగ్ వెనుక మారుతి కృషి ఎంతో ఉంది. ఆ తర్వాత పార్టీ పాట కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు పంపించాం. మరి అతడెక్కడెక్కడ తిరిగాడో ఏమో కానీ కొన్ని అద్భుతమైన విజువల్స్ చేసి తీసుకొచ్చాడు. వాటిని చూడగానే అతడిలో మంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం అర్థమైంది. 

అదే విషయం మారుతితో చెబితే, కొన్ని కథలు అనుకుంటుంటాను కానీ గ్రాఫిక్స్ పైనే ఆసక్తి ఉందని అన్నాడు. కానీ, నీలో దర్శకుడు ఉన్నాడు, దానిపైనే దృష్టి పెట్టు అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పినట్టే ఎంతో ఎదిగాడు. ఇంకా అతడు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వాడు మారుతి. పక్కా కమర్షియల్ ట్రైలర్ చూస్తేనే అన్ని హంగులు ఉన్న చిత్రం అని అర్థమవుతోంది. కచ్చితంగా ఇది పెద్ద హిట్టవుతుంది" అంటూ చిరంజీవి ప్రసంగించారు.

More Telugu News