మోదీకి చదువు లేదు... అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

26-06-2022 Sun 19:04
  • అగ్నిపథ్ ప్రతిపాదనలు చేసిన కేంద్రం
  • దేశంలో నిరసనల వెల్లువ
  • స్పందించిన రేవంత్ రెడ్డి
  • అగ్నిపథ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Revanth Reddy slams Modi and BJP over Agnipath
ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల సైనిక నియామకాల విధానం అగ్నిపథ్ ను పరిచయం చేయడం తెలిసిందే. అగ్నిపథ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు చెలరేగాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, మోదీపైనా, బీజేపీపైనా విమర్శనాత్మకంగా స్పందించారు. ప్రధాని మోదీ చదువు లేని వ్యక్తి అని, అందుకే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

బీజేపీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నమేమీ కాదని, సైనిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మోదీకి, బీజేపీకి తెలియదని అన్నారు. ఇతర దేశాలు దాడులు చేస్తే ప్రతిదాడులకు సైన్యాన్ని వినియోగిస్తారని, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైనికులు రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

అయితే, అగ్నిపథ్ కింద నాలుగేళ్ల పాటు ఆయుధాలు వాడడంపై శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటికి పంపిస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశంలోనూ అయోమయం సృష్టించి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు.