28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము: తెలంగాణ మంత్రి నిరంజన్​ రెడ్డి

26-06-2022 Sun 16:44
  • తొమ్మిదో విడత రైతు బంధు విడుదలకు ఏర్పాట్లు
  • పథకం కింద ఇప్పటివరకు రైతులకు రూ.50,447.33 కోట్లు
  • ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి
  • 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు కృషి
rythu bandhu money credit from june 28th in farmers accounts says minister niranjan reddy
తెలంగాణ రైతులకు రైతు బంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు చేశామని.. 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ.50,447 కోట్లకు పైగా జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో పంటల సీజన్‌కు ముందే ఏయే పంటలు సాగు చేయాలో సూచించడానికి మార్కెట్ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని.. ఇలాంటిది దేశంలోనే తొలిసారి అని తెలిపారు.

ఆయిల్ పామ్ కు ప్రోత్సాహం
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వరికి బదులుగా పత్తి, పప్పు ధాన్యాలు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగడు వంటి నూనె గింజలు, మినుములు, పెసర సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా భారీ స్థాయిలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.