కార్బొహైడ్రేట్లన్నీ చెడ్డవి కాదు.. ఇవి తీసుకుంటే బరువు తగ్గొచ్చు, మధుమేహం కూడా నియంత్రణలోకి..!

 • కార్బోహైడ్రేట్లలో ఫైబర్, స్టార్చ్, చక్కెరలు
 • ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం ఉత్తమం
 • చక్కెరలు ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలని నిపుణుల సూచన
 • ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేస్తే స్టార్చ్, చక్కెరలే మిగులుతాయని వెల్లడి
good carbs and bad carbs what you need to know

ఊబకాయం, మధుమేహం ఇటీవల అందరినీ భయపెడుతున్న జీవనశైలి వ్యాధులు. వీటికితోడు అధిక రక్తపోటు ఇబ్బందిపెడుతోంది. వీటి నుంచి బయటపడాలంటే బరువు తగ్గించుకోవాలని, ఆహారం తీసుకోవడంలో నియమాలు పాటించాలని.. వీలైనంత వరకు కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. నిజానికి మనం తినే ఆహారంలో చాలా భాగం కార్బోహైడ్రేట్లే. మరి వాటికి దూరంగా ఉండటం ఎలాగని చాలా మందికి సందేహం వస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్బోహైడ్రేట్లలో కాస్త మంచి చేసేవి, చెడు చేసేవి రెండు రకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మంచివి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.

శక్తి నిచ్చే మూడింటిలో..

ఆహారంలో మనకు శక్తినిచ్చేవి ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు (ఫ్యాట్‌), ప్రొటీన్లు. వీటిలో ప్రొటీన్లు శరీరానికి అత్యవసరం కాగా.. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కొంత వరకు అవసరం. దాదాపు అన్నిరకాల ఆహార పదార్థాల్లో ఈ మూడూ ఉంటాయి. వీటికి అదనంగా వివిధ కీలక పోషకాలూ ఉంటాయి. అయితే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం మనకు సులువే. కానీ కార్బోహైడ్రేట్లలో ఏవి మంచివి, ఏవి చెడ్డవి అన్నదానిపై చాలా మందికి స్పష్టత లేదు. దీనిపై బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు కిర్‌స్టెన్‌ ఆడి పలు కీలక సూచనలు చేశారు. 

కార్బోహైడ్రేట్లలో మూడు రకాలు

కార్బోహైడ్రేట్లలో మూడు ప్రధాన రకాలు ఫైబర్, స్టార్చ్, చక్కెరలు ఉంటాయని కిర్‌స్టెన్‌ ఆడి తెలిపారు.

 • ఫైబర్, స్టార్చ్‌ రెండూ సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లని.. అవి మన శరీరానికి కావలసిన శక్తి వనరులు అందించడంతోపాటు నాడీ వ్యవస్థ, కండరాలు, ఇతర అవయవాలకు అవసరమైన పోషకాలనూ కలిగి ఉంటాయని వివరించారు.
 • ఇక చక్కెరలు అతి సాధారణ కార్బోహైడ్రేట్‌లు అని, అవి చాలా త్వరగా జీర్ణమై.. గ్లూకోజ్‌ను వేగంగా రక్తంలోకి విడుదల చేస్తాయని తెలిపారు. కానీ వీటిలో కీలక పోషక విలువలు తక్కువని వివరించారు.
 • వీటన్నింటి నేపథ్యంలో ఫైబర్‌ ఎక్కువగా, స్టార్చ్‌ మధ్యస్థంగా, చక్కెరలు అతి తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిదని సూచించారు. ఈ క్రమంలో ఏ ఆహార పదార్థాల్లో మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి? వేటిలో చెడు కార్బోహైడ్రేట్లు ఉంటాయనేది తెలిపారు.

మంచి కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలివీ..
 • ఓట్స్‌
 • క్వినోవా
 • తొక్కతో సహా పూర్తిగా ఉండే పళ్లు
 • చిలగడ దుంపలు (తొక్కతో సహా)
 • బీట్‌ రూట్‌
 • పెరుగు
 • అరటి పండ్లు
 • క్యారెట్లు
 • గింజలు మరియు విత్తనాలు (డ్రైఫ్రూట్స్‌)
 • బ్రౌన్‌ రైస్‌
 • సంపూర్ణ ధాన్యంతో చేసిన బ్రెడ్‌
 • చిక్కుళ్లు (బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, సోయాబీన్స్, వేరుశనగ)

చెడు కార్బోహైడ్రేట్లకు ఉదాహరణలివీ..

సాధారణ ఆహార పదార్థాలనే బాగా ప్రాసెస్‌ చేయడం వల్ల వాటిల్లోని ఫైబర్‌ శాతం బాగా తగ్గిపోతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తొలగిపోతాయి.

స్టార్చ్, అత్యధిక స్థాయిలో చక్కెరలే మిగులుతాయి. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. పాలు, కొన్ని రకాల పండ్లలోనూ చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిలో ఇతర అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల వాటిని తీసుకోవచ్చు.

చెడు కార్బోహైడ్రేట్లు..

 • పాలిష్ చేసిన బియ్యం
 • వైట్‌ బ్రెడ్–మైదా
 • పిజ్జా పిండి
 • పేస్ట్రీలు
 • తెలుపు పాస్తా
 • బీరు
 • పండ్ల రసాలు
 • కూల్‌ డ్రింక్‌
 • చక్కెర కలిపిన సోడా, ఇతర పానీయాలు
 • పాన్‌ కేక్‌లు
 • టొమాటో సాస్‌
 • కేకులు, డోనట్‌లు
 • పఫ్‌లు, బర్గర్లు

More Telugu News