Andhra Pradesh: చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చర్​ వెన్నం జ్యోతి సురేఖ

  • ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్3 లో స్వర్ణం, రజతం
  • మిక్స్ డ్  కాంపౌండ్ విభాగంలో భారత్ కు తొలి స్వర్ణం అందించిన ఆర్చర్లుగా జ్యోతి, అభిషేక్ రికార్డు
  • వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచిన విజయవాడ అమ్మాయి 
AP archer Jyothi surekha wins historical gold and silver in world cup

భారత  స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చరిత్ర సృష్టించింది. పారిస్ లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌ స్టేజ్‌–3లో స్వర్ణ పతకంతో రికార్డు బద్దలు కొట్టిన ఆమె రజతం కూడా కైవసం చేసుకుంది. ఈ టోర్నీల చరిత్రలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో  అభిషేక్‌ వర్మతో కలిసి జ్యోతి సురేఖ భారత్ కు తొలి స్వర్ణం అందించింది. ఫైనల్లో సురేఖ, అభిషేక్ జంట 152–149తో జీన్‌ బోల్చ్‌–సోఫీ డొడిమెంట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచింది. ఈ పోటీలో ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్‌ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలవడంతో ఫలితంపై కాస్త ఉత్కంఠ రేగింది. అయితే, నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధిక్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 

ఇక, కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ  రజతం  సొంతం చేసుకుంది. ఆమె కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది.  ఎల్లా గిబ్సన్‌ (బ్రిటన్‌)తో జరిగిన ఫైనల్లో జ్యోతి తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్‌తో షూటాఫ్ నిర్వహించారు. ఇందులో కూడా గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు సాధించారు. అయితే గిబ్సన్‌ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి.

కాగా,  ఆర్చరీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి సురేఖకు గ్రూప్1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ ఈ మధ్యే ఆమోదం తెలిపింది.

More Telugu News