Vitamins: ఈ రెండు విటమిన్లు లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...?

  • జీవక్రియలకు ఉపయోగపడే డీ3, బీ12
  • మెదడు ఆరోగ్యానికి కీలకం
  • సూర్యరశ్మిలో లభ్యమయ్యే డీ3
  • విటమిన్ల లోపంతో తీవ్ర నష్టం
All about Vitamin D3 and B12

మానవ దేహం ఓ అద్భుతం అని చెప్పాలి. మెదడులో ఆలోచనలు పుట్టడం, ఇతర అవయవాలు మెదడు ఆదేశాలను స్వీకరించి పనిచేయడం శరీర వ్యవస్థలో కీలకం. ఇదంతా సజావుగా సాగాలంటే శక్తి అవసరం. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, కొవ్వులు వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాల కలయికే శక్తి. అందుకే శరీరానికి తగినంత పోషణ కల్పించకపోతే శక్తి హీనత, అనారోగ్యాలు సంభవిస్తుంటాయి. 

ఇక, మానవ దేహ జీవక్రియలకు విటమిన్లు ఎంతగానో తోడ్పాటు అందిస్తుంటాయి. కొన్ని విటమిన్లు లోపించినప్పుడు ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే, డీ3, బీ12 వంటి విటమిన్ల లోపం తలెత్తినప్పుడు బయటికి కనిపించదు కానీ, లోపల్లోపలే నష్టం జరిగిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు విటమిన్ల లోపం ఆరోగ్యాన్ని సైలెంట్ గా కబళించివేస్తుంది. 

శరీరంలోని మెదడు నుంచి ఎముకల వరకు ప్రతి కణంలోనూ డీ3 గ్రాహకాలు ఉంటాయి. మన శరీరంలోని అనేక జన్యువులు సవ్యరీతిలో పనిచేసేందుకు ఈ విటమిన్లే ఛోదకశక్తిగా పనిచేస్తాయి. విటమిన్ డీ3 వల్ల తెల్ల రక్త కణాల ఉత్పాదన మెరుగవుతుంది. వ్యాధినిరోధక టి-కణాలకు పోరాడేశక్తినిచ్చి, వ్యాధులకు వ్యతిరేకంగా సన్నద్ధం చేస్తుంది. థైరాయిడ్, సెక్స్ పరమైన హార్మోన్ల తయారీకి ఉపకరిస్తుంది. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. 

ఎముకల పటుత్వానికి దోహదపడే కాల్షియం, ఫాస్పరస్ లను గ్రహించడానికి తోడ్పడుతుంది. ఇన్సులిన్ వ్యవస్థ సాఫీగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ప్రధానంగా విటమిన్ డీ సూర్యకాంతి ద్వారా, కొన్ని రకాల ఆహారపదార్థాల ద్వారా లభిస్తుంది. సూర్యరశ్మి ద్వారా గ్రహించిన విటమిన్ డీ3ని కాలేయం, కిడ్నీలు యాక్టివేట్ చేస్తాయి. అప్పుడది కేవలం ఓ విటమిన్ గానే కాకుండా, ఓ హార్మోన్ గానూ పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. 

బీ12 విటమిన్ కూడా మానవదేహం సజావుగా పనిచేసేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. శక్తిని ఉత్పత్తి చేయడంలోనూ, కార్బోహైడ్రేట్ సంబంధిత జీవక్రియ, పేగుల ఆరోగ్యం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, కంటి నరాల సహా ఇతర నరాల ఆరోగ్యం, మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణ... ఇలా అనేక విధాలుగా విటమిన్ బీ12 ఉపయోగపడుతుంది. 

ఇక, డీ3, బీ12 విటమిన్లు లోపిస్తే ఏం జరుగుతుందంటే... ఒళ్లు నొప్పులు, మానసిక స్తబ్దత, అలసట, హార్మోన్ల అసమతుల్యత, గోళ్లు చిట్లిపోవడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎస్, క్యాన్సర్, అల్జీమర్స్, ఎముకల బలహీనత, నీరసం, ఆటోఇమ్యూన్ రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సందర్భాల్లోనూ ఈ రెండు విటమిన్లు తగు పాళ్లలో పొందకపోతే తీవ్ర అనారోగ్యం పాలవుతారట. 

చాలారోజుల నుంచి అంటాసిడ్లు, ఇతర ఔషధాలు వాడడం, కీమోథెరపీ వంటి చికిత్సలు, పేగుల సమస్యలు, దీర్ఘకాలిక ఒత్తిడి, పొత్తికడుపులో ఆమ్లాలు, ఏమాత్రం కొవ్వులు లేని ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో ఈ రెండు విటమిన్ల లోపం తలెత్తుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో బి 12 లోపం కనిపిస్తుంది. అందుకని వారు ఈ విషయంలో చెక్ చేసుకుంటూ ఉండాలి.

గ్యాస్ట్రైటిస్, రక్తహీనత ఉన్నవారిలో ఉదరపు గోడలు పలుచబడి బీ12 విటమిన్ శోషింపజేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ విటమిన్ ఎక్కువగా పులియబెట్టిన ఆహార పదార్థాల్లోనూ, ప్రత్యేకించి జంతువుల్లోని కొన్ని అవయవాల మాంసంలోనూ, పాలు, పాల ఉత్పత్తుల్లోనూ మెండుగా ఉంటుందట. 

డీ3 విటమిన్ ప్రధానంగా సూర్యరశ్మిలోనూ, కోడిగుడ్లు, పుట్టగొడుగులు, కొవ్వుతో ఉన్న చేపల్లోనూ పుష్కలంగా ఉంటుంది. అయితే, ఈ రెండు విటమిన్లు మరీ తీవ్ర స్థాయిలో లోపిస్తే డాక్టర్ల సలహాపై విటమిన్ మాత్రలు వాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News