secunderabad riots: సికింద్రాబాద్​ 'అగ్నిపథ్' అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్

main accused in the secunderabad riots subba rao remanded for 14 days
  • అగ్నిపథ్ వస్తే తన అకాడమీ నడవదనే అల్లర్లకు కుట్ర
  • బోడుప్పల్ లో ఓ హోటల్ లో మకాం వేసి ప్లానింగ్
  • అతనికి సహకరించిన మరో ముగ్గురి అరెస్టు
  •  చంచల్ గూడ జైలుకు తరలింపు 
కేంద్ర ప్రభుత్వ పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక కీలక సూత్రధారి అయిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మల్లారెడ్డి, శివ, బెస్సిరెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావుపై 26  కేసులు నమోదయ్యాయి. కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 

 ప్రాథమిక విచారణలో సుబ్బారావు, ఇతరుల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. వాటిని రిమాండ్ రిపోర్టులో చేర్చారు. అల్లర్ల కోసం ముందుగానే బోడుప్పల్ లోని ఓ హోటల్ లో మకాం వేసిన సుబ్బారావు, శివ విధ్వంసానికి పథకం రచించారని గుర్తించారు. వివిధ వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి 2019 ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని తెలుసుకున్నారు. ‘అగ్నిపథ్’ పథకం వస్తే తన అకాడమీ నడవదని భావించే.. అల్లర్లకు కుట్ర చేశాడని గుర్తించారు. సుబ్బారావుతోపాటు 60 మందికి పైగా పేర్లను రిపోర్టులో చేర్చారు. 

తన అకాడమీలో ఒక్కో అభ్యర్థికి కోచింగ్ ఇచ్చేందుకు సుబ్బారావు దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసేవాడని, అగ్నిపథ్ వస్తే తనకు రూ. 50 కోట్ల దాకా నష్టం వస్తుందని ఆందోళన చెందాడట. దాంతో, బీహార్ మాదిరిగా రైళ్లను తగలబెట్టాలని వాట్సప్ గ్రూపుల్లో విద్యార్థులకు సూచించనట్టు పోలీసులు తెలుసుకున్నారు. అల్లర్లలో పాల్గొన్న వారికి బిర్యానీ ప్యాకెట్లు, పెట్రోలు, మంచి నీళ్ల కోసం అతను రూ. 35 వేలు ఖర్చు చేస్తే రైల్వేకు 30 కోట్ల దాకా నష్టం ఏర్పడింది.
secunderabad riots
avula subbarao
Agnipath Scheme
railway station
Telangana police
remand

More Telugu News