Maharashtra: మా కుటుంబాలకు ఏదైనా జరిగితే సర్కారుదే బాధ్యత.. సీఎం ఉద్ధవ్​కు షిండే లేఖ

Rebel Shiv Sena MLA Eknath Shinde writes to CM Uddhav Thackeray
  • ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించారని ఆరోపణ
  • మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీకి కూడా లేఖ
  • అలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న హోం మంత్రి
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను అధికారంలో నుంచి దింపాలని ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబల్ ఎమ్యెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్ధవ్.. మిత్రపక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

అయితే, ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించారని ఆరోపిస్తూ సీఎం ఉద్ధవ్ కు ఏక్ నాథ్ షిండే లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కారుదే బాధ్యతన్నారు. భద్రత తొలగించడమంటే భయపెట్టడమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారన్నారు. మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. 

దీనిపై మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ స్పందించారు. 38 మంది ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత ఉపసంహరించాలని ముఖ్యమంత్రి గానీ, హోం శాఖ గానీ ఆదేశించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా స్పందించారు. భద్రత ఎమ్మెల్యేలకు మాత్రమే కల్పిస్తారని, వారి కుటుంబ సభ్యులకు కాదన్నారు. తమ పార్టీ చాలా పెద్దదని, దాన్ని ఎవ్వరూ హైజాక్ చేయలేరని అభిప్రాయపడ్డారు.  ‘మా రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఇది. దీని కోసం అనేక మంది ఎన్నో త్యాగాలు చేశారు. డబ్బుతో ఎవరూ దాన్ని విచ్ఛిన్నం చేయలేరు’ అని స్పష్టం చేశారు.
Maharashtra
Uddhav Thackeray
eknath shinde
letter
rebel mlas

More Telugu News