e passports: చిప్ ఆధారిత పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

  • పౌరుడి సమాచారం అంతా చిప్ లో నిక్షిప్తం
  • సమాచారానికి మరింత రక్షణ
  • నవంబర్ నుంచి అమల్లోకి తెస్తామన్న కేంద్ర మంత్రి జైశంకర్
  • పాత పాస్ పోర్ట్ లు మార్చుకోవాల్సి రావచ్చు
Chip based e passports to roll out this year what is it and how will it work

విదేశీ ప్రయాణం సులభంగా మారుతుంది. పాస్ పోర్ట్ లోని డేటా సురక్షితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తీసుకురానున్న చిప్ ఆధారిత ఈ-పాస్ పోర్ట్ ఫీచర్లలో ఇవి కొన్ని. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్ పోర్ట్ తెస్తున్నట్టు ప్రకటన చేయడం గుర్తుండే ఉంటుంది. తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్, ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ-పాస్ పోర్ట్ ల జారీని అమలు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. 

ఏటా జూన్ 24వ తేదీని పాస్ పోర్ట్ దివస్ గా పరిగణిస్తుంటారు. ఈ సందర్భంగా జైశంకర్ ఈ విషయాన్ని తెలిపారు. పౌరులకు తదుపరి స్థాయి అనుభవాన్ని ఈ-పాస్ పోర్ట్ తో అందిస్తామని ప్రకటించారు. చిప్ ఆధారిత ఈ-పాస్ పోర్ట్ లను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలు అందిస్తున్నాయి. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఐర్లాండ్, జింబాబ్వే తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 

ఈ పాస్ పోర్ట్ లో ఏముంటుంది?
సాధారణ పాస్ పోర్ట్ ల మాదిరే ఈ-పాస్ పోర్ట్ పనిచేస్తుంది. కాకపోతే చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో పౌరుడి సమాచారం అంతా ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డు మాదిరిగా. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ కావడంతో దీన్ని మెషిన్ల సాయంతో రీడ్ చేయవచ్చు. కస్టమ్స్ అధికారులు పాస్ పోర్ట్ ను స్కాన్ చేసి అందులోని సమాచారాన్ని తనిఖీ చేయడానికి వీలుంటుంది. దీనివల్ల సమాచారం గోప్యంగా ఉండడమే కాకుండా, నకిలీ పాస్ పోర్ట్ లకు చెక్ పడుతుంది. ఈ-పాస్ పోర్ట్ కాంట్రాక్టును టీసీఎస్ చూస్తోంది.
 
ఇప్పటికే పాకెట్ బుక్ పరిమాణంలో పాస్ పోర్ట్ లు ఉన్న వారు.. కొత్త చిప్ ఆధారిత పాస్ పోర్ట్ ను తీసుకోవాల్సి రావచ్చు. కాకపోతే దీనిపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. అమల్లోకి వచ్చిన తర్వాత ప్రకటన రావచ్చు. ఎందుకంటే పాస్ పోర్ట్ లోని సమాచారానికి రక్షణ అన్నది చిప్ తోనే సాధ్యపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా భౌతిక రూపంలోని పాస్ పోర్ట్ లను అనుమతిస్తే నకిలీలను ఏరిపారేయాలన్న లక్ష్యం దెబ్బతింటుంది.

More Telugu News