politics: ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి

  • 11 దేశాల్లో 57,561 మందిపై పరిశోధన
  • ఓటర్ల కంటే మూడేళ్ల నుంచి ఏడున్నరేళ్లు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు గుర్తింపు
  • కనీసం 69 ఏళ్లు జీవిస్తున్న నేతలు
  • సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ఆదాయం, ఉత్తమ వైద్యమే కారణం
Politicians live average 4 5 years longer general public study finds

ఎలక్షన్లప్పుడు వెంటపడి మరీ తిరిగి.. ఓటేశాక ఐదేళ్లు కనిపించకుడా పోతారని రాజకీయ నాయకుల తీరుపై తరచూ సెటైర్లు పడుతుంటాయి. ఇలాంటి కామెంట్లు ఏమోగానీ.. ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు మాత్రం ఎక్కువని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సగటు ఆయుర్దాయం కంటే రాజకీయ నాయకులు సగటున నాలుగున్నరేళ్లు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు తేలింది.

11 దేశాల్లో అధ్యయనం చేసి..
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 19వ శతాబ్దం మొదటి నుంచి ఇటీవలి వరకు 11 దేశాలకు చెందిన 57,561 మంది రాజకీయ నాయకుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. వీరిలో 40,637 మంది ఇప్పటికే చనిపోయారు. ఈ క్రమంలో వారి జీవిత కాలాన్ని.. ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, ఆయుర్దాయం గణాంకాలను సేకరించి.. ఓ నివేదికను రూపొందించారు. 

  • రాజకీయ నాయకులు కనీసం 69 ఏళ్లు జీవిస్తున్నారని తెలిపారు. 
  • ప్రజల కంటే రాజకీయ నాయకుల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటమనేది దేశాలను బట్టి వేర్వేరుగా ఉన్నట్టు ఆక్స్ ఫర్డ్ నివేదిక పేర్కొంది.
  • తమ నియోజక వర్గంలోని ప్రజల కంటే రాజకీయ నాయకులు మూడేళ్ల నుంచి ఏడున్నరేళ్ల వరకు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు తెలిపింది.
  • ఆయుష్షులో తేడా స్విట్జర్లాండ్ లో తక్కువగా మూడేళ్లు ఉండగా.. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలలో 3.5 ఏళ్లు, ఆస్ట్రియా, న్యూజిలాండ్, కెనడాలలో 4 ఏళ్లు, జర్మనీలో 4.5 ఏళ్లు, ఫ్రాన్స్లో 6 ఏళ్లు, అమెరికాలో 7 ఏళ్లు, ఇటలీలో ఏడున్నరేళ్లు ఉందని నివేదిక పేర్కొంది.

మంచి ఆదాయం.. వైద్యంతో..
సాధారణంగా రాజకీయ నాయకులకు మంచి ఆదాయం ఉండటం, ఉత్తమ వైద్యం అందే అవకాశాలు ఉండటమే వారి ఆయుష్షు ఎక్కువగా ఉండటానికి కారణమని ఆక్స్ ఫర్డ్ నివేదిక పేర్కొంది. ‘‘సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల ఆయుర్దాయంపై మేం చేసిన అధ్యయనం ఇప్పటివరకు జరిగిన స్టడీల్లో అతి పెద్దది. 19వ శతాబ్దం, 20వ శతాబ్దం మొదటితో పోలిస్తే.. ప్రస్తుతం రాజకీయ నాయకుల ఆయుర్దాయం మరింతగా పెరిగింది. సమాజంలో గొప్పవారిగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో వారు ఉత్తమ జీవనం గడిపే అవకాశాలు పెరిగాయి” అని ఈ పరిశోధనలో పాల్గొన్న ఆక్స్ ఫర్డ్ హెల్త్ ఎకనమిక్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ లారెన్స్ రూప్ తెలిపారు.

More Telugu News