gold price: వారంలో రూ.1,000 తగ్గిన బంగారం ధర.. కొనుగోళ్లకు అవకాశమేనా?

  • ఇక్కడి నుంచి మరింత నష్టపోయే అవకాశాలు తక్కువ
  • బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాలు
  • రూపాయి విలువ క్షీణత బంగారానికి అనుకూలమని విశ్లేషణ
Gold price tumbles over RS 1000 in a week Is this dip a buying opportunity

బంగారం ధరలు కాస్త శాంతించాయి. గడిచిన వారం రోజుల్లో  తులం బంగారం ధర రూ.1,000 వరకు తగ్గింది. ఆగస్ట్ నెలకు సంబంధించి 10 గ్రాముల బంగారం ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర రూ.50,603కు చేరింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1826 డాలర్ల దగ్గర ఉంది. ఒక ఔన్స్ 28.34 గ్రాములకు సమానం. 

పసిడికి తక్షణం 1810 డాలర్ల మద్దతు ఉన్నట్టు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీని తర్వాత బలమైన మద్దతు 1770 డాలర్ల వద్ద ఉందంటున్నారు. ఎంసీఎక్స్ లో బంగారానికి తక్షణ మద్దతు రూ.49,900 వద్ద ఉంటే, ఆ తర్వాత రూ.49,200 వద్ద ఉందని చెబుతున్నారు. 

‘‘ఇటీవలి వారాల్లో వరుసగా బంగారం ధరలు పెరిగినందున కొంత శాంతించాయి. డాలర్ రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపును అనుసరిస్తున్నాయి. అయితే, ఆర్థిక మందగమనం ఆందోళనల నేపథ్యంలో బంగారం ధరలు ఇక్కడి నుంచి పెద్దగా తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తారు కనుక’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ విపుల్ శ్రీవాస్తవ తెలిపారు. 

ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా స్పందిస్తూ.. "వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాలు బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీశాయి. అయితే రూపాయి బలహీనపడడం బంగారం, వెండి ధరలకు మద్దతునిచ్చే అంశం’’ అని చెప్పారు.

More Telugu News