హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'

25-06-2022 Sat 11:11
  • మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'
  • తెలుగు రీమేక్ గా వచ్చిన 'భీమ్లా నాయక్'
  • హిందీ రీమేక్ కోసం సన్నాహాలు 
  • జాన్ అబ్రహం హీరోగా సెట్స్ పైకి 
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగు
John Abraham New Movie Update
మలయాళంలో 2020లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఒకటి. పృథ్వీరాజ్ సుకుమారన్ - బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాను తెలుగులో 'భీమ్లా నాయక్' పేరుతో రీమేక్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

మలయాళ మూలం దెబ్బతినకుండా త్రివిక్రమ్ ఆ కథలో చాలా మార్పులు చేశాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ - రానా నటించగా, ఇక్కడ కూడా విశేషమైన ఆదరణ పొందింది. ఒక బలమైన మల్టీ స్టారర్ సినిమాగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

'అయ్యప్పనుమ్ కోషియుమ్' హిందీ రీమేక్ హక్కులు జాన్ అబ్రహం తీసుకున్నాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయన అనురాగ్ కశ్యప్ కి అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరో పాత్రను ఎవరు చేయనున్నారనేది త్వరలోనే తెలియనుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు.