తెలుగు వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే సంతోషించే వాళ్లమనడంలో సందేహం లేదు: జీవీఎల్ నరసింహారావు

25-06-2022 Sat 09:37
  • ద్రౌపది ముర్ము గొప్ప మహిళ అని కొనియాడిన జీవీఎల్
  • ప్రతిపక్షాలు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నాయని వ్యాఖ్య
  • గత మూడు దశాబ్దాలలో ఇంత సానుకూల వాతావరణం ఎప్పుడూ లేదన్న జీవీఎల్
I would be very happy if Telugu candidate fielded in presidential elections says GVL Narasimha Rao
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని బీజేపీ నిలబెడుతుందని చాలా మంది అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా ద్రౌపది ముర్మును ఆ పార్టీ బరిలోకి దింపింది. దీంతో, ఎంతోమంది ముఖ్యంగా తెలుగువారు చాలా నిరాశకు గురయ్యారు. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఉంటే ఏంటో సంతోషించే వాళ్లమనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. 

మరోవైపు ద్రౌపది ముర్ముపై జీవీఎల్ ప్రశంసలు కురిపించారు. కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్ గా సుశిక్షితురాలైన ఆదివాసీ మహిళ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో సర్వత్ర పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. దేశానికే వన్నె తెచ్చే గొప్ప మహిళ ఆమె అని కొనియాడారు. ప్రతిపక్షాలు సైతం ఆమెకు మద్దతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై దేశ వ్యాప్తంగా ఇంత సానుకూల వాతావరణం నెలకొనడం గత మూడు దశాబ్దాలలో తానెప్పుడూ చూడలేదని అన్నారు.