Karnataka: కర్ణాటక రెండుగా విడిపోతుందన్న రాష్ట్ర మంత్రి వ్యాఖ్యలపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందన

minister Umesh Katti said Karnataka divided into two after LS polls
  • వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటవుతాయన్న మంత్రి
  • ఉత్తర కర్ణాటక కోసం పోరాడాలని పిలుపు
  • యూపీలో నాలుగు, మహారాష్ట్రలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారని వెల్లడి
  • ఆయన అలాగే మాట్లాడతారన్న సీఎం 
వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కర్ణాటక రెండుగా విడిపోబోతోందంటూ ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తనకు తెలిసిందని అన్నారు.

కాబట్టి ‘ఉత్తర కర్ణాటక’ కోసం మనం పోరాడాలంటూ మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో రెండు, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడతాయని మంత్రి చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మంచిదేనన్న ఆయన ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినా తాము మాత్రం కన్నడిగులుగానే ఉంటామన్నారు. 

కర్ణాటక రెండుగా చీలిపోతుందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదన్నారు. మంత్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన అలా మాట్లాడడం కొత్తేమీ కాదని కొట్టిపడేశారు. రెవెన్యూ మంత్రి ఆర్. అశోకా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉమేష్ ఇప్పటి వరకు వందసార్లు మాట్లాడారని అన్నారు. 

మరోవైపు, ఇదే విషయమై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం మంత్రి ద్వారా బయటపడిందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Karnataka
North Karnataka
States
Basavaraj Bommai
Siddaramaiah
Umesh Katti

More Telugu News