బాలినేనికి చెప్పేదొక్కటే... ఓ స్థాయి దాటి ఆడబిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తాం: పవన్ కల్యాణ్

24-06-2022 Fri 21:37
  • జనసేన పార్టీ నేత రాయపాటి అరుణకు వేధింపులు
  • బాలినేని అనుచరులపై పవన్ ఆగ్రహం
  • మీడియాపైనా కేసులు పెట్టారన్న పవన్
  • కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Pawan Kalyan warns Balineni aides
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అర్ధరాత్రి ఫోన్లు చేసి మానమర్యాదలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతి? అంటూ నిలదీశారు. ఈ విషయాన్ని రాయపాటి అరుణ్ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యేకి తెలియజేశారని పవన్ వెల్లడించారు. 

అయితే, ఈ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాని బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే అని, అయితే, ఓ స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ఈ వ్యవహారంలో ధైర్యంగా ఉండాలంటూ రాయపాటి అరుణకు ఫోన్ ద్వారా చెప్పానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆడబిడ్డను వేధించిన ఘటనను ప్రసారం చేసిన మహా టీవీ, 99 టీవీ చానళ్లపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.

"మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేసేది ఒక్కటే... మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి" అంటూ హితవు పలికారు. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటాం... అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మహా టీవీ, 99 టీవీ చానళ్లపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, తద్వారా సమస్యకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.