బండ్ల గ‌ణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి... రెండు గంట‌ల పాటు సుదీర్ఘ చ‌ర్చ‌లు

24-06-2022 Fri 21:22
  • గ‌తంలో కాంగ్రెస్ లో యాక్టివ్‌గా బండ్ల గ‌ణేశ్
  • తిరిగి ఆయ‌న‌ను పార్టీలో యాక్టివేట్ చేసే దిశ‌గా రేవంత్ చ‌ర్య‌లు
  • స్వ‌యంగా బండ్ల గ‌ణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
  • రేవంత్ నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు ఎదురుచూస్తున్నానంటూ బండ్ల ట్వీట్‌
revanth reddy meets bandla ganesh
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి శుక్ర‌వారం టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేశ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయ‌న‌తో ఏకంగా రెండు గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చ‌లు సాగించారు. సినీ నిర్మాత‌గానే జ‌నానికి తెలిసిన బండ్ల గ‌ణేశ్ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి య‌మా యాక్టివ్‌గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డిన బండ్ల‌కు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చేసింది. ఫ‌లితంగా మ‌న‌సు నొచ్చుకున్న గ‌ణేశ్ రాజ‌కీయాల‌కు దూరంగా జ‌రిగి త‌న సినీ నిర్మాణ ప‌నుల్లోనే బిజీ అయిపోయారు.

తాజాగా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేసే దిశ‌గా గ‌తంలో యాక్టివ్‌గా ఉండి ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న నేత‌ల‌ను తిరిగి యాక్టివేట్ చేసే దిశ‌గా రేవంత్ సాగుతున్నారు. 

ఇందులో భాగంగానే ఆయ‌న గ‌ణేశ్ ఇంటికి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ భేటీపై వారిద్ద‌రూ మీడియాతో మాట్లాడ‌కున్నా... గ‌ణేశ్ మాత్రం రేవంత్‌తో భేటీ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేయ‌డంతో పాటు రేవంత్ నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ఓ కామెంట్ జ‌త చేశారు. దీంతో గ‌ణేశ్‌ను తిరిగి పార్టీలో యాక్టివేట్ చేసేందుకే ఆయ‌న ఇంటికి రేవంత్ వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.