బ‌ర్త్ డే నాడు హోం మంత్రికి స్వ‌యంగా మిఠాయి తినిపించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

24-06-2022 Fri 20:27
  • జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ‌నిత‌
  • కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో హోం మినిస్ట్రీ ద‌క్కిన వైనం
  • బ‌ర్త్ డే నాడు జ‌గ‌న్ నుంచి ఆశీర్వాదం తీసుకున్న వ‌నిత
ap cm ys jagan greets home minister taneti vanitha
ఏపీ హోం మంత్రి తానేటి వ‌నిత జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆమెకు బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. 2019 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ఆమెకు జ‌గ‌న్ తొలి కేబినెట్‌లోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప‌నిచేసిన ఆమె.. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్ర‌మోష‌న్ ద‌క్కి ఏకంగా హోం మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 

ఈ క్ర‌మంలో మ‌రింత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తానేటి వ‌నిత త‌న ప‌ని తీరును మెరుగుప‌ర‌చుకునేందుకు శాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నాడు త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆమెకు పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు బ‌ర్త్ డే విషెస్ తెల‌ప‌గా... సీఎం జ‌గ‌న్ నుంచి నేరుగా ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె స‌చివాలయానికి స్వీట్ బాక్స్‌తో వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన జ‌గ‌న్.. స్వ‌యంగా ఓ మిఠాయిని తీసుకుని ఆమెకు తినిపించారు. ఈ ఫొటోను ఆమె కార్యాల‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.