రామ్ గోపాల్ వర్మ ఒక వేస్ట్ ఫెలో: రాజాసింగ్

24-06-2022 Fri 17:49
  • రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ద్రౌపతి ముర్ము
  • పాండవులెవరు, కౌరవులెవరు అని ప్రశ్నించిన వర్మ
  • వర్మపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న రాజాసింగ్
Ram Gopal Varma is a waste fellow says Raja Singh
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున బరిలోకి దిగిన ద్రౌపతి ముర్మును ఉద్దేశించి సినీ దర్శకుడు చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్రౌపది రాష్ట్రపతి అవుతుంటే... మరి పాండవులు ఎవరు? ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు వర్మపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అని అన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత స్థానానికి ఎన్నికవుతున్న తరుణంలో ఇలాంటి ట్వీట్ బాధను కలిగించిందని చెప్పారు. మరోవైపు తన ట్వీట్ పై వర్మ వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని చెప్పారు.