Chandrababu: చంద్రబాబును కలిసి కన్నీటిపర్యంతమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

  • ఇటీవల హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం
  • హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
  • సీబీఐ విచారణ కోరుతున్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు
  • తాము కూడా ఒత్తిడి తెస్తామన్న చంద్రబాబు
Driver Subrahmanyam parents met TDP President Chandrababu

ఇటీవల ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. తాజాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సత్యనారాయణ, నూకరత్నం నేడు టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తమ బిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారంటూ చంద్రబాబు ఎదుట వాపోయారు. తాము ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతున్నామని, అయితే తమ డిమాండ్ ను ఎవరూ పట్టించుకోవడంలేదని వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకంలేదని స్పష్టం చేశారు. అనంతబాబును ఈ కేసు నుండి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. 

చంద్రబాబును కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ, రూ.5 లక్షలు ఆర్థిసాయంతో పాటు అన్నివిధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. సీబీఐ విచారణ కోసం తాము కూడా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారని సత్యనారాయణ, నూకరత్నం వెల్లడించారు. 

కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు అనంతబాబుకు జులై 1 వరకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 20తో అనంతబాబు రిమాండ్ ముగియగా, ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆయన రిమాండ్ పొడిగిస్తున్నట్టు రాజమండ్రి కోర్టు వెల్లడించింది.

More Telugu News