హిందూపురం వైసీపీలో వ‌ర్గ‌పోరు... ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంపై రాళ్లేసిన ఎమ్మెల్సీ వ‌ర్గం

24-06-2022 Fri 17:33
  • హిందూపురం వైసీపీలో రెండు వ‌ర్గాలు
  • ఓ వ‌ర్గం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ది కాగా...ఇంకోదానికి వేణుగోపాల్ రెడ్డి నేతృత్వం
  • ఇక్బాల్‌కు వ్య‌తిరేకంగా వేణుగోపాల్ రెడ్డి మీడియా స‌మావేశం
  • ప్రెస్ క్ల‌బ్‌పై రాళ్ల దాడికి దిగిన ఇక్బాల్ వ‌ర్గం
two sections of ysrcp clash in hindupur
ఏపీలోని స‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురంలో అధికార పార్టీ వైసీపీలో వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. పార్టీకి చెందిన రెండు వ‌ర్గాలు బ‌హిరంగంగానే బాహాబాహీకి దిగాయి. ఓ వ‌ర్గం రెండో వ‌ర్గంపై రాళ్ల దాడికి పాల్ప‌డ‌గా... రంగంలోకి దిగిన పోలీసులు రెండు వ‌ర్గాల‌ను విడ‌దీశారు. ఘ‌ట‌నా స్థ‌లి నుంచి ఓ వ‌ర్గాన్ని పంపించివేయ‌డంతో ప‌రిస్థితి సద్దుమ‌ణిగింది. 

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... హిందూపురం అసెంబ్లీ నుంచి 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఇక్బాల్ ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ద‌క్కింది. ఈ క్ర‌మంలో నియోజ‌కవ‌ర్గంలో ఎమ్మెల్సీని వ్య‌తిరేకిస్తూ ఓ వ‌ర్గం త‌యారైంది. ఈ వ‌ర్గానికి వేణుగోపాల్ రెడ్డి నేతృత్వం వ‌హిస్తున్నారు. 

ఇదిలావుంచితే, ఇక్బాల్‌కు వ్య‌తిరేకంగా వేణుగోపాల్ రెడ్డి నేడు పట్ట‌ణంలోని ప్రెస్ క్ల‌బ్‌లో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. స‌రిగ్గా మీడియా స‌మావేశం మొద‌ల‌వుతుందనుకున్న స‌మ‌యంలో ఇక్బాల్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి అక్క‌డికి వ‌చ్చారు. వ‌చ్చీ రాగానే ప్రెస్ క్ల‌బ్‌పై రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన‌గా... స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి వ‌చ్చి ఇక్బాల్ వర్గాన్ని అక్క‌డి నుంచి పంపించి వేశారు.