apple: ప్రతీ 10 ప్రీమియం ఫోన్లలో ఆరు యాపిల్ ఫోన్లే

  • 60 శాతం మార్కెట్ వాటా యాపిల్ సొంతం
  • కొనసాగుతున్న ఐఫోన్ 13 సిరీస్ హవా
  • ఐఫోన్ల మొత్తం అమ్మకాల్లో 45 శాతం ఇవే
  • శామ్ సంగ్ కు 16 శాతం వాటా
60 percent of premium phones sold in the world are Apple iPhones

ప్రీమియం ఫోన్లలో యాపిల్ హవా కొనసాగుతోంది. 60 శాతం వాటాతో ప్రీమియం ఫోన్ల మార్కెట్ ను శాసిస్తోంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో వుంటూ దూసుకుపోతోంది. 

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం.. ప్రీమియం ఫోన్ల విభాగంలో యాపిల్ 60 శాతం వాటాను కలిగి ఉంది. 400 డాలర్లు (అంటే రూ.30,000 పైన) అంతకుమించి విలువ కలిగిన ఫోన్లు ప్రీమియం విభాగం కిందకు వస్తాయి. ఈ విభాగంలో పోటీ తక్కువేమీ కాదు. శామ్ సంగ్, వన్ ప్లస్ సహా ఎన్నో కంపెనీలు పోటీ పడుతుంటాయి. అయినప్పటికీ ఐఫోన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

‘‘2021 అక్టోబర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్. విడుదల చేసి ఏడు నెలలే అయినా పోటీ ఫోన్లను వెనక్కి నెట్టేసింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో 23 శాతం వాటా ఐఫోన్ 13 కలిగి ఉంది’’ అని కౌంటర్ పాయింట్ తెలిపింది. అమ్ముడుపోయే ప్రతి నాలుగు ప్రీమియం ఫోన్లలో ఒకటి యాపిల్ ఐఫోన్ 13 ఉంటోంది. 

ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ప్రీమియం ఫోన్ల మార్కెట్లో 13 శాతం, ఐఫోన్ 13 ప్రో 9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యాపిల్ మొత్తం ఐఫోన్ల అమ్మకాల్లో, ఐఫోన్ 13 సిరీస్ విక్రయాలు 45 శాతంగా ఉన్నాయి. 

ప్రీమియం ఫోన్లలో దక్షిణ కొరియాకు చెందిన శామ్ సంగ్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ 16 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించింది. అంతేకాదు, ప్రీమియం విభాగంలో శామ్ సంగ్ వాటా స్వల్పంగా క్షీణించినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గెలాక్సీ ఎస్ 22 విడుదల ఆలస్యం వల్లేనని పేర్కొంది. గెలాక్సీ ఎస్22 అల్ట్రా ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో చైనాకు చెందిన షావోమీ మూడో స్థానంలో ఉంది.

More Telugu News