Maharashtra: ఉద్ధవ్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.. ‘మహా’ సంక్షోభంపై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు

There is no greater shame for Uddhav than this says Vijayashanti over MAHA crisis
  • శివసేనలో రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా పెరుగుతారన్న విజయశాంతి 
  • తండ్రి చెప్పిన మాటలు ఉద్ధవ్ తుంగలో తొక్కారని విమర్శ 
  • అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపారని ఆరోపణ 
  • దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకుంటున్నారని  విజయశాంతి ఎద్దేవా
మహారాష్ట్రలో తాజా రాజకీయాలపై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, నటి విజయశాంతి స్పందించారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలను వదిలి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు. శివసేనలో రెబల్ ఎమ్మెల్యేల  సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసిన శివసేన పార్టీలో  సీనియర్‌ నేత, క్యాబినెట్‌ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. ఉద్ధవ్ ఇప్పటికే సీఎం అధికారిక నివాసాన్ని  ఖాళీ చేసిన సొంతిల్లు ‘మాతోశ్రీ’కి వెళ్లారు. ఈ పరిణామాలపై విజయశాంతి వరుస ట్వీట్లలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

‘మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు. సీఎం ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోంది. సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ఈ సంక్షోభం రుజువు చేసింది.

 లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్ధవ్ తండ్రి బాల్ థాకరే శివసేన పార్టీ స్థాపించారు. పొత్తులు,సంకీర్ణ సర్కార్లపై  ఆయన గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహించాలని కూడా స్పష్టంగా చెప్పారు. ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారు’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ‘చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారు. చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా... దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చింది. ఉద్ధవ్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు’ అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు. 

Maharashtra
VIJASHANTHI
Uddhav Thackeray
NCP
BJP
Shiv Sena

More Telugu News