Vienna: నివాసానికి అత్యంత అనుకూలమైన నగరం ‘వియన్నా’

Vienna returns as worlds most liveable city 6 in top 10 list from Europe
  • మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్న ఆస్ట్రియా రాజధాని
  • 34వ ర్యాంకుకు పడిపోయిన ఆక్లాండ్
  • ఆక్లాండ్ కు గతేడాది మొదటి స్థానం
  • కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో ర్యాంకుల్లో స్థానచలనాలు
ఈ ప్రపంచంలో నివాసానికి అత్యంత అనుకూలమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా మరోసారి నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఏటా ఈ మేరకు ఓ జాబితా విడుదల చేస్తుంటుంది. గతేడాది ఆక్లాండ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. కానీ, ఈ ఏడాది ఆక్లాండ్ ఏకంగా 34వ స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కరోనా కారణంగా విధించిన ఆంక్షలే. 

‘‘2021 ర్యాంకుల్లో వియన్నా 12వ స్థానానికి తగ్గిపోయింది. మ్యూజియంలు, రెస్టారెంట్లు మూసేయడం వల్లే మొదటి ర్యాంకును కోల్పోయింది. ఇప్పుడు తిరిగి వాటిని తెరవడంతో 2018, 2019 ర్యాంకుల్లో మాదిరే మొదటి స్థానాన్ని ఆక్రమించింది’’ అని ఈఐయూ తెలిపింది. మంచి సదుపాయాలు, స్థిరత్వం, చక్కని వైద్య సదుపాయాలు, సంస్కృతి, వినోదానికి సంబంధించి ఎన్నో అవకాశాలు వియన్నా సొంతమని పేర్కొంది. 

డ్యానిష్ రాజధాని కోపెన్ హేజెన్, కాల్గరీ, స్విట్జర్లాండ్ కు చెందిన జ్యురిచ్, వాంకోవర్, జెనీవా, ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ), టొరంటో, నెదర్లాండ్స్ పట్టణం ఆమ్ స్టర్ డ్యామ్, ఒసాకా, మెల్ బోర్న్ టాప్ 10లో ఉన్నాయి. లండన్ 33, చైనా బీజింగ్ 71 స్థానాల్లో నిలిచాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను పరిగణనలోకి తీసుకోలేదు. రష్యాపై ఆంక్షల వల్ల మాస్కో 15 స్థానాలు, సెయింట్ పీటర్స్ బర్గ్ 13 స్థానాలు దిగువకు వెళ్లిపోయాయి. టాప్ 10లో ఆరు పట్టణాలు యూరోప్ నుంచే ఉన్నాయి.  

Vienna
most liveable city
worlds top city

More Telugu News