Telangana: హైదరాబాద్​లో 300 ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు.. ఏర్పాటు చేసే ప్రాంతాలివే

 300 EV charging stations to be installed in Hyderabad
  • జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటుకు నిర్ణయం
  • ప్రతి 3 కిలో మీటర్లకు ఒక స్టేషన్ ఉండేలా ప్రణాళిక
  • అవసరం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో కూడా ఈవీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దాంతో, ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ, వాళ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తగినన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం. తెలంగాణలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

ఈవీలు ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో 300 ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. వీటిని  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఇందిరా పార్క్, కేబీర్ పార్క్ గేట్ 1, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ సమీపంలో), ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వంటి అనేక ప్రదేశాలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

 జీహెచ్ఎంసీ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను త్వరలో జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచి, ఆమోదిస్తామని బల్దియా అధికారి ఒకరు చెప్పారు. నగరంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అవసరం ఎక్కువగా ఉన్న చోట వాటి సంఖ్యను పెంచుతారు. ఈ మేరకు ఆదాయ-భాగస్వామ్య నమూనాలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ, టీఎస్ఆర్ఈడీసీఓ (తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మధ్య ఒప్పందం కుదిరింది.

 ప్రసుతం హైదరాబాద్  నగరంలో దాదాపు 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు, సాధారణ పెట్రోల్ బంక్‌ల సమీపంలో ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్ గేట్-1, గేట్-3, గేట్-6, ట్యాంక్ బండ్ రోడ్, అబిడ్స్ మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, నానక్ రాంగూడ , వనస్థలిపురంలోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ దగ్గర), సికింద్రాబాద్ తాజ్ త్రీస్టార్ హోటల్ సమీపంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ఈవీ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
Telangana
Hyderabad
electric vehicles
EV charging stations
GHMC
hmda

More Telugu News