Gangula Kamalakar: స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మంత్రి గంగుల పీఆర్‌వో.. ఆడియో వైరల్

Minister Gangula Kamalakar PRO Demands Money For Station Bail
  • 3.53 నిమిషాల నిడివి ఉన్న రెండు ఆడియోలు బయటకు
  • డబ్బులు వెంటనే కావాలని డిమాండ్
  • ఏసీపీ, సీఐలకు కూడా డబ్బులు అడ్జస్ట్ చేయాలన్న పీఏ
  • బయటకు చెబితే పోలీసులకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరిక
  • పీఏను తొలగించిన మంత్రి గంగుల కమలాకర్
ఓ నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు మంత్రి పీఆర్‌వో ఒకరు డబ్బులు డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు తెలిస్తే పోలీసులకు చెడ్డపేరు వస్తుందంటూ పీఆర్‌వో చెప్పడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తంగా 3.53 నిమిషాల నిడివి ఉన్న రెండు ఆడియో క్లిప్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే, సదరు వ్యక్తి తాను మంత్రికి పీఆర్వో అయినప్పటికీ, పీఏనని చెప్పుకున్నాడు.    

కరీంనగర్‌లో అనుమతులు లేని తాగునీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఒక కేసులో అరెస్ట్ అయిన బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్ పీఆర్‌వో మల్లికార్జున్ రంగంలోకి దిగారు. 

తాను ఇప్పుడే ఏసీపీతో మాట్లాడానని, స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్‌కు వెళ్లి మంత్రి పీఏ మల్లికార్జున్ సార్ చెప్పాడని పోలీసులకు చెబితే బెయిలు ఇస్తారని పేర్కొన్నారు. అయితే, ఇందుకు కొంతమొత్తం ఖర్చవుతుందని, ఏసీపీ, సీఐలకు కూడా అడ్జస్ట్ చేయాలని మల్లికార్జున్ చెప్పుకొచ్చారు. డబ్బులు మాత్రం వెంటనే ఇవ్వాలని, ఎంత అనేది తాను తర్వాత చెబుతానని పేర్కొన్నారు. 

అయితే, ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని, చెబితే పోలీసులకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఆడియో వైరల్ కావడంతో మంత్రి గంగుల స్పందిస్తూ.. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పీఆర్‌వోను విధుల నుంచి తప్పించినట్టు చెప్పారు. కాగా, ఈ విషయమై డీసీపీ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ చేయించనున్నట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.
Gangula Kamalakar
Karimnagar
Station Bail

More Telugu News