Bones: ఎముకల పటిష్ఠతకు దోహదపడే ఆహార పదార్థాలు ఇవిగో!

  • ఎముక పుష్టికి కీలకంగా కాల్షియం 
  • కాల్షియం లోపిస్తే బలహీనంగా ఎముకలు
  • ఆహార పదార్థాలతో లోపాన్ని అధిగమించే అవకాశం
  • సరైన ఆహారమే మేలంటున్న నిపుణులు
Food for healthy bones

ప్రస్తుత కాలంలో ఒత్తిళ్లతో కూడిన దైనందిన జీవితంలో పోషకాహార లోపం సాధారణమైపోయింది. ప్రధానంగా కాల్షియం లోపించినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. మానవ దేహం సాఫీగా పనిచేయాలంటే ఎముకల ఆరోగ్యం కూడా ముఖ్యమే. విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా కొద్దిమేర ఉపశమనం లభించినా, సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే మెరుగైన ఆరోగ్యం పొందగలం. ఎముకల పటిష్ఠతకు దోహదపడే ఆహార పదార్థాలేవో ఓసారి చూద్దాం. 

నువ్వులు, బీన్స్, రాగులు... ఈ మూడింట్లో కాల్షియం అత్యధిక స్థాయిలో ఉంటుందని ఓ పోషకాహార నిపుణురాలు వెల్లడించారు. నువ్వులు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఇందులో ఎముకలను గట్టిపరిచే కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. 

ఇక బీన్స్ లో ఎముకల పటుత్వానికి సహకరించే అనేక పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. బీన్స్ లో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ధాతువులు కూడా ఉంటాయి. ఆహారంలో బీన్స్ ను అధికంగా తీసుకోవడం ద్వారా పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. మనకు సులువుగా దొరికే రాగుల్లోనూ కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. రాగి పిండితో చేసే జావ, రొట్టెలు, బూరెలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.

ఇవేకాకుండా, పైనాపిల్, పాలకూర, నట్స్, అరటి, బొప్పాయి వంటి వాటిలోనూ ఎముకల బలానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. పైనాపిల్ పొటాషియంకు మంచి వనరు. పైనాపిల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్ల స్థితిని సమతుల్యం చేసి, కాల్షియం నష్టపోకుండా చూస్తుంది. 

పాలకూర విషయానికొస్తే.. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. మానవదేహం రోజువారీ కార్యకలాపాలకు అవసరమయ్యే కాల్షియంలో 25 శాతం ఒక కప్పు ఉడకబెట్టిన పాలకూరను తినడం ద్వారా పొందవచ్చు. 

బాదం, జీడి, వేరుశనగ వంటి నట్స్ లోనూ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ నిల్వలు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం... ఎముకలు కాల్షియంను గ్రహించేందుకు తోడ్పడుతుంది. అరటి పండు మెగ్నీషియంకు అద్భుతమైన వనరు. ఎముకల నిర్మాణంలో మెగ్నీషియందే కీలకపాత్ర. అందుకే ప్రతి రోజు ఒక అరటిపండు తింటే ఎముక పుష్టి లభిస్తుందని చెబుతారు. 

మనకు విరివిగా లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. 100 గ్రాముల బొప్పాయిలో 20 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందట. ఇవన్నీ మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, కాల్షియం, మెగ్నీషియం లోపాన్ని అధిగమించి ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి.

More Telugu News